Telangana CSO Alert to Secretariat Security :తెలంగాణ స్పెషల్ పోలీసుల ఆందోళనలు సచివాలయాన్ని కూడా తాకాయి. సచివాలయం భద్రత సిబ్బంది కదలికలు, సోషల్ మీడియాపై నిఘా ఉందని సెక్రటేరియెట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ తెలిపారు. పోలీసు బెటాలియన్ల సిబ్బంది ఆందోళనల నేపథ్యంలో సచివాలయం భద్రత సిబ్బందిని అప్రమత్తం చేస్తూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గంగారాం మెమో జారీ చేశారు. రాష్ట్రానికి అతి ముఖ్యమైన సచివాలయం వద్ద పనిచేస్తున్నందున ఎవరిని కలుస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎలాంటి పోస్టులు పెడుతున్నారనే విషయాలపై నిఘా ఉంటుందన్నారు. అందుకే సచివాలయం భద్రత సిబ్బంది అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఒక్కరు తప్పు చేసినా అందరిపై ప్రభావం ఉంటుందని సీఎస్ఓ హెచ్చరించారు.
సోషల్ మీడియాపై నిఘా ఉందని హెచ్చరిక : సచివాలయం చుట్టూ 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడిలో పాల్గొంటే చట్టపరమైన చర్యలు ఉంటాయని మిత్రులు, సహచర సిబ్బందికి వివరించాలని సూచించారు. పోలీసు అధికారులకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వాట్సప్ గ్రూపులకు అడ్మిన్‌గా వెంటనే వైదొలగాలని సీఎస్ఓ తెలిపారు. ప్రభుత్వానికి, పోలీసు అధికారులకు వ్యతిరేకంగా పోస్టులు, కామెంట్లు పెట్టవద్దని షేర్, లైక్ చేయవద్దన్నారు పొరపాటున దొరికితే వెంటనే శాఖపరమైన చర్యలు ఉంటాయన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని సచివాలయం భద్రత నిర్వహణలో ఉన్న టీజీఎస్పీ సిబ్బంది అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు.