తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ తల్లి రూపంపై స్పందించిన విజయశాంతి - ఏమందంటే? - CONGRESS LEADER VIJAYASHANTHI TWEET

తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో స్పందించిన విజయశాంతి - మొదటగా తల్లి తెలంగాణ పార్టీ ఆవిష్కరించిన విగ్రహాన్ని బీఆర్​ఎస్​ మార్చలేదా? అంటూ ధ్వజం

TWEET ON TELANAGANA THALLI
CONGRESS LEADER VIJAYASHANTHI (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2024, 12:50 PM IST

Vijayashanthi Tweet Viral : తల్లి తెలంగాణ పార్టీ 2007లో మొదట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని కాంగ్రెస్‌ మహిళా నాయకురాలు విజయశాంతి గుర్తు చేశారు. అప్పటి విగ్రహాన్ని బీసీ కమిషన్​ మాజీ ఛైర్మన్​ బీఎస్ రాములు రూపొందించినట్లు తెలిపారు. అనంతరం కొంత కాలానికి బీఆర్​ఎస్​ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిందని చెప్పారు. కానీ ఆ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి అధికారిక హోదా, గౌరవం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్‌’ వేదికగా ట్వీట్​ చేశారు.

ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి హయాంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లిని పరిపాలనకు గుండె లాంటి సచివాలయంలో ప్రతిష్టించి, గౌరవ మర్యాదలు చేసిందని చెప్పారు. బీఆర్​ఎస్​కు తెలంగాణ తల్లి రూపం మార్పుపై మాట్లాడే, కొట్లాడే హక్కు లేదని విమర్శించారు. తల్లి తెలంగాణ పార్టీ రూపొందించిన విగ్రహాన్ని గతంలో బీఆర్​ఎస్​ మార్పు చేస్తే ఎవరైనా కొట్లాడారా? అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ పండుగలు బోనాలు, బతుకమ్మల సంస్కృతి, సంప్రదాయాలు తరతరాలుగా నిలిచే ఉన్నాయి. వాటిని రాజకీయ పార్టీలు స్వార్ధ ప్రయోజనాలకు వాడుకోవద్దని విజయశాంతి హితవు పలికారు.

వేల విగ్రహాలు ఆవిష్కరిస్తాం : తెలంగాణ తల్లి విగ్రహంపై కొద్ది రోజులుగా ప్రతిపక్షం నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఎన్ని జీవోలిచ్చినా, ఎన్ని కేసులుపెట్టినా తెలంగాణ జాగృతి, బీఆర్​ఎస్​ పార్టీ ఆధ్వర్యంలో వేల సంఖ్యలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరిస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే జగిత్యాలలో తెలంగాణ తల్లి విగ్రాహానికి భూమి పూజ కూడా చేశారు. బతుకమ్మ పండుగను గుర్తు చేసుకుని మండల కేంద్రంలో బతుకమ్మ ఆట ఆడారు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్యాంధ్రను కోరుకున్న కాంగ్రెస్‌ నాయకుల వైఖరి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కొనసాగిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్​ అగ్రనాయకులు ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రియాంక, రాహుల్‌గాంధీలు బతుకమ్మ ఎత్తుకుని ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారిక చిహ్నం నుంచి చారిత్రక కట్టడం చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించే ప్రయత్నం చేసి విమర్శలు రావడంతో విరమించుకున్నారని కవిత ఆరోపించారు.

సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

ఏటా డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం - అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details