ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చంద్రబాబుపై కేసీఆర్​కు అసూయ, ద్వేషం - ఏపీ రాజకీయాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు - Revanth Reddy on AP Politics - REVANTH REDDY ON AP POLITICS

Revanth Reddy on Andhra Pradesh Politics: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్​ రాజకీయాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్‌ గెలవబోతున్నట్లు కేసీఆర్, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అదే విధంగా షర్మిల కట్టుకున్న చీర గురించి ఏపీ సీఎం జగన్‌ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏపీ, తెలంగాణ రాజకీయాలపై రేవంత్ రెడ్డి పలు విషయాలను ఈటీవీ - భారత్​తో పంచుకున్నారు.

revanth reddy
revanth reddy

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 9:13 AM IST

Telangana CM Revanth Reddy on Andhra Pradesh Politics: చంద్రబాబు నాయుడుపై కేసీఆర్​కు ఆసూయ, ద్వేషం అని అందుకే జగన్​కు అనుకూలంగా మాట్లాడుతున్నారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈటీవీ - భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ రాజకీయాలతో పాటు అనేక విషయాలను పంచుకున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

చంద్రబాబుపై కేసీఆర్​కి అసూయ, ద్వేషం - ఏపీ రాజకీయాల గురించి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  • ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ గెలవబోతున్నట్లు తమకు సమాచారముందని కేసీఆర్‌, కేటీఆర్‌లు అంటున్నారు. ఇదేమైనా రాజకీయ వ్యూహమా? ఆ వ్యాఖ్యల ప్రభావం తెలంగాణపై పడే అవకాశముందా?

రేవంత్ రెడ్డి:చంద్రబాబునాయుడుపై ఉండే అసూయ. ద్వేషం. అంతకంటే ఏముంటుంది? కేసీఆర్‌కు ఏదో బాధ, దుఃఖం. కేసీఆర్‌కు, జగన్‌ల మధ్య అవగాహన ముందు నుంచీ ఉన్నదే. చంద్రబాబు అరెస్టును కూడా సమర్థించారు. జగన్‌, కేసీఆర్‌ ఒక జట్టుగా వ్యవహరిస్తున్నారు.

  • ఏపీలో ఎన్నికల ఫలితాలపై మీ అంచనా?

రేవంత్ రెడ్డి: ఎక్కడైనా ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉంది. వాళ్లు చెప్పిన మాట నిలబెట్టుకోనందువల్ల ప్రతికూల వాతావరణం ఉంది. మేం షర్మిల నాయకత్వంలో అక్కడ కాంగ్రెస్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాం. ఎన్ని సీట్లను గెలిపించుకోగలం? షర్మిల ప్రశ్నించే గొంతుకగా ప్రజా సమస్యలపై ఎలా కొట్లాడుతున్నారు? ఆమెకు ఎలా మద్దతుగా నిలబడాలి? అనేదే నా ప్రణాళిక. ఆంధ్రప్రదేశ్​లో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనేదే మా రాజకీయ ప్రణాళిక. ఈసారి అక్కడ అన్ని సీట్లలో పోటీకి దిగాం. మా దృష్టంతా కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమైన ఎన్నికల వాతావరణాన్ని సృష్టించడంపైనే.

  • షర్మిల కట్టుకున్న చీర గురించి కూడా ఏపీ సీఎం జగన్‌ మాట్లాడారు.

రేవంత్ రెడ్డి:అది ఆయన విజ్ఞత. సొంత చెల్లెలనే కాదు, ఇతర ఆడపిల్లల గురించి కూడా జాగ్రత్తగా మాట్లాడడం మంచిదని నా సూచన.

  • ఈ ఎన్నికల్లో విజయానికి ఏం చేయబోతున్నారు?

రేవంత్ రెడ్డి:ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో మూడు బహిరంగ సభలు నిర్వహిస్తాం. గ్రామస్థాయి వరకు మేం చేసింది, చేయబోయేదీ వివరిస్తాం. జాతీయస్థాయి నేతలు ఖర్గే, రాహుల్‌, ప్రియాంకాగాంధీలు ప్రచారంలో పాల్గొంటారు. జాతీయ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తాం. మోదీ పాలనలో దేశానికి, యువత, మైనార్టీలకు మహిళలకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరిస్తాం.

  • ఈ ఎన్నికలు మీ పాలనపై రిఫరెండం అని ఇప్పటికే మీరు ప్రకటించారు. ఎన్ని సీట్లు వస్తాయని మీ అంచనా ?

రేవంత్ రెడ్డి:కచ్చితంగా వంద రోజుల మా పాలనను రిఫరెండంగా భావించి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నాం. 14 ఎంపీ సీట్లు సాధిస్తాం. ప్రజాతీర్పు ఎలా ఉన్నా గౌరవించాల్సిందే. గత 4 నెలల్లో మేం అందించిన పాలనలో అద్భుతాలు చేయకపోయినా, తప్పులు మాత్రం చేయలేదని మేం బలంగా నమ్ముతున్నాం. ప్రజలు ఆశించిన ప్రకారం చేస్తున్నాం. మా పాలన కొన్ని వర్గాలను ఎక్కువ సంతోషపెట్టి ఉండవచ్చు. మరికొన్ని వర్గాలను సంతోషపెట్టకపోయి ఉండవచ్చు. కానీ మేం ఎక్కడా ప్రజలను నిరాశపరిచే విధంగా వ్యవహరించలేదనే నమ్మకంతోనే రిఫరెండంగా భావించమని ప్రజలకు చెబుతున్నాం.

  • కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంలో యువత ప్రధాన పాత్ర పోషించింది. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగ యువతకు మీరు ఏం చేయబోతున్నారు?

రేవంత్ రెడ్డి:మేం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. గ్రూప్‌ 1, మెగా డీఎస్సీ తదితర ఖాళీలకూ నోటిఫికేషన్​లను సైతం ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగాల్లోని అన్ని ఖాళీలనూ భర్తీ చేస్తాం. తెలంగాణలో ఉన్న నిరుద్యోగానికి ఈ ఖాళీలను భర్తీ చేస్తే సరిపోదు. ప్రపంచంలో ఉండే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అమెరికా తదితర దేశాల్లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ఉన్నతవిద్యను అభ్యసించాలి. అక్కడ ఉద్యోగ, వ్యాపారాల్లో రాణించాలి. ఇందుకు సంబంధించిన అన్ని రకాల ప్రోత్సాహకాలు, అవకాశాలను కల్పించే విధంగా ప్రణాళిక ఉంటుంది.

  • రిజర్వేషన్ల రద్దు గురించి మాట్లాడుతున్నారు. అది అవాస్తవమని, సాధ్యం కాదనిబీజేపీ నేతలు అంటున్నారు..?

రేవంత్ రెడ్డి: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్ల మెజార్టీ ఇవ్వాలని బీజేపీ అడుగుతోంది అందుకే కదా. గతంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్‌ ఉండేది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల చట్టంలోనే సబ్‌ క్లాజ్‌ కింద ఆంగ్లో ఇండియన్ల రిజర్వేషన్‌ ఉండేది. లోక్‌సభలో దాన్ని సులువుగా రద్దు చేశారు. లోక్‌సభలో 300 సీట్ల బలంతో, అదే విధంగా రాజ్యసభలో మెజార్టీ లేకున్నా ఆర్టికల్‌ 370, జీఎస్టీ, ట్రిపుల్‌ తలాక్‌, నోట్ల రద్దు వంటి నిర్ణయాలన్నీ అమలు చేశారు. రిజర్వేషన్లు ఉండవద్దన్నది ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీల విధానం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటూ అనేక కులాల విభజన కనిపించకుండా హిందువులంతా ఒకే వర్గంగా ఉండాలన్న లక్ష్యంతో రిజర్వేషన్​లను రద్దు చేయాలనేది బీజేపీ లక్ష్యం. ఆర్‌ఎస్‌ఎస్‌ ఏర్పడి 2025కి వందేళ్లు పూర్తవుతున్నందున దీన్ని అమలు చేయాలనుకుంటున్నారు. రెండు రోజుల కిందట ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన సమావేశంలో, రిజర్వేషన్లు తొలగిస్తే మద్దతిచ్చేవారు లేచి నిలబడండి అని అడిగారు. రిజర్వేషన్ల రద్దు యోచనతోనే బీసీ జనాభా లెక్కలను సేకరించడానికి మోదీ అంగీకరించడం లేదు.

  • కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి?

రేవంత్ రెడ్డి:ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేశాం. 3 నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. బీసీ జనాభా లెక్కల సేకరణకు శ్రీకారం చుట్టాం. ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు, ఆసరా పెన్షన్లు ఇస్తున్నాం. కేసీఆర్‌కు 2014లో 16 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో తెలంగాణ రాష్ట్రాన్ని అప్పగించాం. తొమ్మిదిన్నరేళ్ల పాలన తరువాత రూ.7 లక్షల కోట్ల అప్పుతో మాకు అప్పగించారు. శ్రీశైలం, సాగర్‌, జూరాల వంటివన్నీ ఎండబెట్టి మాకు ఇచ్చారు. వీటిని తీసుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, 4 నెలల్లో రూ.26,500 కోట్ల కిస్తీలు కట్టాం. రాష్ట్రాన్ని గాడిన పెట్టడానికి మేం కష్టపడుతుంటే అభినందించకపోగా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.

  • కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినందునే కరవు వచ్చిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీనివల్ల ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఏమైనా నష్టం జరిగే అవకాశం ఉందా ?

రేవంత్ రెడ్డి:ఓటు వేసేవారు రైతులు. వానలు ఎప్పుడు పడతాయనేది వారికి తెలియదా? మేం డిసెంబరు 7న చలికాలంలో పాలనలోకి వచ్చాం. చలికాలంలో వానలు పడతాయా? కాంగ్రెస్‌ పార్టీ డిసెంబరులో అధికారంలోకి వస్తే కరవు వచ్చిందనడానికి కేసీఆర్‌కు ఆలోచన ఉందా? వానాకాలంలో వానలు పడి రిజర్వాయర్లు నిండి, ఆ నీటిని మేం వదిలేస్తే మా తప్పవుతుంది. పై రాష్ట్రాల్లో వర్షాలు పడితే తెలంగాణలోని రిజర్వాయర్లలోకి నీరు వస్తుంది. కరవు రాష్ట్రంగా ప్రకటించిన కర్ణాటక సుప్రీంకోర్టుకు వెళ్లి నిధుల కోసం పోరాడితే కేంద్ర ప్రభుత్వం వాళ్లకి 3495 కోట్ల రూపాయలు ఇచ్చింది. తెలంగాణలోని జూరాల, శ్రీశైలం, సాగర్‌ వంటి ప్రాజెక్టులకు నీరు రావాలంటే ఎగువన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల్లో వర్షాలు పడాలి. అక్కడ కరవు ఉందని ఆ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకుంటుంటే, ఇక్కడ కాంగ్రెస్‌ వల్ల కరవు వచ్చిందని కేసీఆర్‌ మాట్లాడుతున్నారంటే ఏమనాలి?

  • తెలంగాణకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన శత్రువు అని కేసీఆర్‌ అంటున్నారు. మీకు పాలన చేతకాలేదని ప్రచారం చేస్తున్నారు.?

రేవంత్ రెడ్డి:కేసీఆర్‌ అక్కసు వెళ్లగక్కుతున్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి ప్రథమ శత్రువు ఎలా అయింది? గతంలోనే రైతు రుణమాఫీ చేసినందుకా? రైతులకు ఉచిత కరెంటు ఇచ్చినందుకా? ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేసినందుకా? రాజీవ్‌ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినందుకా? మైనారిటీ రిజర్వేషన్లు ఇచ్చినందుకా? హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు తెచ్చినందుకా? మెట్రో రైలు ఇచ్చినందుకా? ఔటర్‌ రింగ్‌రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించినందుకా, ఎందుకు శత్రువులమయ్యాం? పదేళ్లపాటు కేసీఆర్‌, మోదీ ఫెయిల్‌ అయ్యారు. 2014 వరకు 14 మంది ప్రధానమంత్రులు చేసిన అప్పు రూ.55 లక్షల కోట్లయితే.. ఆ తర్వాత పదేళ్లలో నరేంద్రమోదీ చేసిన అప్పు రూ.113 లక్షల కోట్లు. ఆయనేమో మూడోసారి ప్రధాని కావాలట.. 100 రోజుల్లో వచ్చిన నేను మాత్రం దిగిపోవాలట. రూ.7 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రశేఖర్‌రావు నన్ను దిగిపొమ్మంటున్నారు. ఇది వారిద్దరి ఒప్పందం. అసలాయన ఎవరి మీద కొట్లాడుతున్నారు? ఎవరిని తిడుతున్నారు? ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నవి ఎవరికి? దిగాల్సింది ప్రధానమంత్రి కదా? ఆయన్ను విడిచిపెట్టి.. నా మీద పడతారేంటి? అంటే కేసీఆర్‌ స్పష్టంగా మోదీతో సుపారీ తీసుకొని, కాంగ్రెస్‌ పార్టీని ఖతం చేయడానికి బయలుదేరారు. ఇది ప్రజలు గమనిస్తున్నారు.

  • మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ, బీఆర్​ఎస్​లు కలిసి కుట్ర చేస్తున్నాయని మీరు ఆరోపించడం, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చడానికేనని విపక్షాలు అంటున్నాయి.

రేవంత్ రెడ్డి:మా ప్రభుత్వం వచ్చింది మొన్నే కదా. వ్యతిరేకత ఎందుకుంటుంది? స్కూల్​లో చేరిన విద్యార్థి ఒకటో తరగతి నుంచి రెండో తరగతికి వెళ్లాలంటే కనీసం సంవత్సరం పాటు చదవాలి కదా. ప్రభుత్వం పనిచేస్తోందా లేదా అని తెలియడానికి వంద రోజులు సరిపోతుందా? మోదీ, కేసీఆర్‌ పది సంవత్సరాలు దుర్మార్గాలు చేసి, మేం పాలనలోకి వచ్చిన వెంటనే మాపై వ్యతిరేకత వచ్చిందంటూ, కూలగొడతాం, పడగొడతాం అంటున్నారు. వాళ్ల ట్రాక్‌ రికార్డు అలాగే ఉంది.

  • ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి మీ ప్రణాళికలేమిటి?

రేవంత్ రెడ్డి:ఫార్మా క్లస్టర్లు, హెల్త్‌, ఎడ్యుకేషన్‌, స్పోర్ట్స్‌ టూరిజంలతో పాటు, ఆర్గానిక్‌ ఫుడ్‌పైనా దృష్టి పెట్టాం. సేంద్రియ పంటలను పండించడానికి రైతులకు సాంకేతిక నైపుణ్యం, నీళ్లు అందిస్తాము. రీజినల్‌ రింగ్​రోడ్డు తెలంగాణకు పెద్ద వరం. ఔటర్‌ రింగురోడ్డుతో తెలంగాణ ఆర్థిక పరిస్థితులు ఒక స్థాయికి వచ్చినట్లే రీజినల్‌ రింగురోడ్డుతో మరింత అభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ రాష్ట్రం ప్రపంచ పెట్టుబడులకు ద్వారం తెరిచినట్లు అవుతుంది. ఇతర రాష్ట్రాలు, దేశాల్లోని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడతాయి. వాళ్ల పెట్టుబడికి నష్టం కలగకుండా చూసే బాధ్యత మనది. దీంతో రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్‌ ప్రణాళిక ఉంటుంది.

  • కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలున్నాయని మీరు అనడం ఏ విధమైన ఎత్తుగడ?

రేవంత్ రెడ్డి:నేను భువనగిరిలో ఆ మాట అన్న సందర్భాన్ని గుర్తించాలి. అంతకు ఒకరోజు ముందు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ, కోమటిరెడ్డి బ్రదర్స్‌ దిగజారిపోయారు, మంత్రి పదవి కోసం సీఎం కాళ్లు పట్టుకుని మస్కా కొడుతున్నారని, వాళ్లకు ఆ అర్హతే లేదని ఏదేదో అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేసి తన మంత్రి పదవిని సైతం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి త్యాగం చేశారు. మళ్లీ మంత్రి పదవి ఇస్తానన్నా తీసుకోలేదు. ఆయన ట్రాక్‌ రికార్డు తెలుసుకుని మాట్లాడాలి కదా. అన్ని అర్హతలూ ఉన్న వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత కూడా ఉందని, మంత్రి పదవి కోసం మస్కా కొట్టాల్సిన అవసరం ఆయనకు లేదని నేను జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి అన్నాను. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎంతో అనుభవమున్న పార్లమెంటేరియన్‌.

  • మీరు బీజేపీలో చేరుతారని బీఆర్​ఎస్ బాగా ప్రచారం చేస్తోంది?

రేవంత్ రెడ్డి:నేను కాంగ్రెస్‌ పార్టీకి నూటికి నూరు శాతం నిబద్ధతతో పనిచేసే వ్యక్తిని. కొందరు అసూయతో మాట్లాడతారు. ఇలాంటి వ్యాఖ్యలకు విలువ ఉండదు. మోదీ ప్రధాని, నేను ముఖ్యమంత్రి. మేం అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు శత్రువుల్లా ఉంటామా? తెలంగాణ రాష్ట్రానికి కావాల్సింది నేను అడిగా. ఆయన ఇవ్వగలిగింది ఇస్తారు. ఇవ్వకపోతే కొట్లాడడానికి నాకెలాగూ మార్గం ఉంటుంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో నేను బీజేపీను విమర్శించకుండా ఊరుకుంటున్నానా? వాళ్ల తప్పిదాలను లేవనెత్తకుండా వదిలేశామా?

  • వచ్చే ఐదేళ్లలో తెలంగాణ స్వరూపాన్ని ఎలా ఊహిస్తున్నారు?

రేవంత్ రెడ్డి: రాబోయే పదేళ్లు కాంగ్రెస్‌ అధికారంలో ఉంటుంది. వచ్చే పదేళ్లలో ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం. ‘వైబ్రెంట్‌ తెలంగాణ 2050’ అనే ప్రణాళికతో మొత్తం తెలంగాణ ముఖచిత్రమే మార్చాలనేది ఆలోచన. ఆనాడు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు.. ఔటర్‌ రింగురోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్లు, ఫార్మా కంపెనీలు, మెట్రో రైలు, గోదావరి- కృష్ణా నదీ జలాలను హైదరాబాద్‌కు తరలించడం, శాంతిభద్రతలను నియంత్రణలో ఉంచడం, ఇవన్నీ జరిగాయి. వీటిని ఇంకా ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లడానికి మేము ప్రయత్నిస్తున్నాము.

  • ఈ ఎన్నికల్లో మీకు రాష్ట్రంలో ఎవరితో పోటీ ఉందనుకుంటున్నారు. ప్రజల నాడి ఎలా ఉందని భావిస్తున్నారు ?

రేవంత్ రెడ్డి:అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్‌తో మాకు పోటీ. ఇప్పుడు దేశానికి ప్రధానిని ఎన్నుకోవడానికి ఈ ఎన్నికలు జరుగుతున్నందున నరేంద్ర మోదీతోనే మాకు పోటీ. బీజేపీను దించడానికే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే బీజేపీ పాలన విధానాలను, ఆ పార్టీ మళ్లీ వస్తే జరిగే ప్రమాదాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఎన్నికల్లో పోటీ మాకు బీజేపీతోనే ఉంటుంది. బీఆర్​ఎస్ పోటీలోనే లేదు. గతంలో బీఆర్​ఎస్​కి ఎంపీ సీట్లు వచ్చినా మోదీకే మద్దతిచ్చారు. దీన్నిబట్టి ఆయనకు ఓటేస్తే మోదీకే మద్దతిస్తారని, ప్రజలు ఈసారి కేసీఆర్‌కు ఓటు ఎందుకు వేయాలని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ, బీఆర్​ఎస్ నేతలు చీకట్లో మాట్లాడుకుంటున్నారు. బయటికేమో పొత్తు లేదంటూ చీకట్లో పొత్తు పెట్టుకుని, బీజేపీనే గెలిపించాలని అనుకోవడం వల్ల బీఆర్​ఎస్ ఉనికినే కోల్పోతోంది.

  • కాంగ్రెస్‌ అధిష్ఠానానికి తెలంగాణలోని మీ ప్రభుత్వం ఏటీఎంలాగా మారిందని ప్రధానమంత్రి మోదీ,బీజేపీనేతలు ఆరోపిస్తున్నారు..?

సీఎం:ఎన్నికలు ఉన్న ప్రతి సారీ వాళ్లు దిల్లీ నుంచి వచ్చి ఇలాంటి మాటలే చెబుతుంటారు. మొన్నటి ఎలక్టోరల్‌ బాండ్లలో ఎవరు అవినీతిపరులో, ఎవరికి బాండ్లు ఇచ్చారో, ఎవరి మీద కేసులున్నాయో తెలిసిపోయింది. ఈ దేశంలో అత్యంత అవినీతిపరులుగా అధికంగా కేసులు ఎదుర్కొంటున్న వాళ్లందరూ బీజేపీలోనే చేరారు. నరేంద్రమోదీ పక్కనే కూర్చొంటున్నారు.

  • తెలంగాణలో రియల్‌ ఎస్టేట్‌ బలహీనపడిందనే విమర్శలున్నాయి?

రేవంత్ రెడ్డి:ఇది పూర్తిగా అబద్ధపు ప్రచారం. డిసెంబరు 7, 2022 నుంచి ఏప్రిల్‌ 7, 2023 వరకూ 4 నెలల్లో బీఆర్​ఎస్ ప్రభుత్వ హయాంలో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో అనుమతులు, నిరభ్యంతర పత్రాలు, రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ ఏ మేరకు ఉన్నాయో లెక్కలు తీయండి. అదే విధంగా డిసెంబరు 7, 2023 నుంచి ఏప్రిల్‌ 7, 2024 వరకూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పురోగతిని పరిశీలించండి. హైదరాబాద్‌కు ఇచ్చిన నీళ్లు, విద్యుత్‌ సరఫరా లెక్కలను కూడా తీయండి. అప్పటి, ఇప్పటి లెక్కలతో మీరే నివేదికలు తయారు చేయండి. రియల్‌ ఎస్టేట్‌ పెరిగిందా? తగ్గిందా? అనేది మీకే అర్థమవుతుంది. ఎలాగైనా సరే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బద్నామ్‌ చేయాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ అద్భుతంగా ఉంది. అనుమతులు సులువుగా వచ్చేస్తున్నాయి. ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరిగింది.

  • కాంగ్రెస్‌ నేతల్లో ఎన్నడూ లేనంత ఐక్యత ప్రస్తుతం మీ ప్రభుత్వంలో కనిపిస్తోంది. కారణం?

రేవంత్ రెడ్డి:మా అందరికీ తెలంగాణ అభివృద్ధిపైనే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలేవీ లేవు. మా కాంగ్రెస్‌ నేతలంతా సీనియర్లు. ఎంతో అనుభవమున్నవారు. నాకు అనుభవం కొంత తక్కువగా ఉంది. వారి సూచనలు తీసుకుని పనిచేస్తున్నందున ప్రభుత్వాన్ని నడపడంలో నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు.

  • గ్యారంటీ హామీలు, రుణమాఫీ అమలుకు భారీగా నిధులు అవసరం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అదనపు ఆదాయం పెంచేందుకు ప్రణాళికలేంటి?

రేవంత్ రెడ్డి:రైతుభరోసా వంటి వాటికి అదనంగా కొంత అవసరం. నూటికి నూరు శాతం మేం రైతులకు రుణమాఫీ చేసి చూపిస్తాం. ఆషామాషీగా చెప్పట్లేదు. సీఎం అయిన తరువాత అంచనా లేకుండా మాట్లాడతానా? అందుకే రాజీనామా లేఖను జేబులో పెట్టుకుని రమ్మని, ఆగస్టు 15వ తేదీన మాట్లాడతానని హరీశ్‌రావుకు చెప్పా. రుణమాఫీ కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం. రైతుల రుణాలన్నీ ఈ కార్పొరేషన్‌కు బదిలీ చేసేలా చర్యలు తీసుకుంటాం. దీంతో రుణానికి, రైతుకు సంబంధం ఉండదు, కాళేశ్వరం కార్పొరేషన్‌, రుణాలకోసం ఇతర కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్లే ఇది కూడా. వచ్చే బడ్జెట్‌లో రాష్ట్ర ఆదాయం, వ్యయం ఎంత అనేది మాకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి రుణం తీసుకుని రుణమాఫీకి కట్టేసి అన్నదాతలకు విముక్తి కల్పిస్తాం. ఈ ప్రక్రియ అంతా జూన్‌ 4న ఎన్నికల కోడ్‌ ముగిశాక ప్రారంభించి ఆగస్టు 15కల్లా పూర్తిచేస్తాం. ఏటా 10 - 12 శాతం ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి పెరుగుతుంది. ఇప్పటికే నెలకు రూ.500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల వరకూ పెరిగింది. ఈ అదనపు ఆదాయాన్ని రైతు రుణమాఫీ కోసం మేం తీసుకోబోయే కొత్త రుణానికి కిస్తీ కింద కడితే 60 నెలల్లో బాకీ తీరిపోతుంది.

  • కాళేశ్వరంలో ఇప్పుడు తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా, నీటి కొరత ఏర్పడింది. వచ్చే ఖరీఫ్‌, రబీ సీజన్లకు నీటి కొరతను ఏ విధంగా అధిగమిస్తారు?

రేవంత్ రెడ్డి:కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో ప్రధానమైనది పాలమూరు రంగారెడ్డి. దీనికి నీటి కేటాయింపులు తీసుకొని వాటిని పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తాం. గోదావరి మీద తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టును కేసీఆర్‌ నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మహారాష్ట్రతో సంప్రదింపులు మొదలుపెట్టాం. అక్కడ 1800 ఎకరాల భూమిని తీసుకుని తుమ్మిడిహెట్టిలో 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడితే, అక్కడి నుంచి నీళ్లు నిల్వ చేసుకొని కిందకు కాల్వలు తవ్వాలి. దీనివల్ల తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వచ్చు. ఇప్పటికే కేసీఆర్‌ కట్టిన వాటిలో కూలినవెన్ని? కుంగినవెన్ని? ఉపయోగపడేవి ఎన్ని ఉన్నాయనేది కూడా చూస్తాం. కేసీఆర్‌ కట్టారని, వాటిని గాలికి వదిలేయం. ప్రజలకు ఉపయోగిస్తాం. కేసీఆర్‌ వాళ్ల ఆస్తులో, తాతముత్తాతల ఆస్తులో అమ్మి వాటిని కట్టలేదు కదా. ప్రజల సొమ్ముతోనే నిర్మించారు కదా. అందుకే ప్రజలకు ఉపయోగపడేవాటిని సరిగ్గా వినియోగిస్తాం. గోదావరి జలాలకు సంబంధించిన కాళేశ్వరాన్ని కూడా ఉపయోగంలోకి తీసుకొస్తాం.

  • ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై మీకున్న సమాచారమేమిటి?

రేవంత్ రెడ్డి: ఎన్నికల కోడ్‌ రావడం వల్ల ఈ అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేదు. ఇప్పుడు నేను వివరాలు బయటకు చెబితే, విచారణకు ఇబ్బంది అవుతుంది. ఎన్నికల తర్వాత బడ్జెట్‌ సమావేశాలొచ్చినప్పుడు, శాసనసభలో పూర్తిస్థాయిలో దాని వివరాలను బయటపెడతాం. దీనిపై అధికారులు టెలిగ్రాఫిక్‌ చట్టం, సైబర్‌ క్రైమ్‌ చట్టాలను పరిశీలిస్తున్నారు.

  • బీఆర్​ఎస్ ఎమ్మెల్యేల చేరికలకు గేట్లు అన్నీ తెరిచినట్టేనా?

రేవంత్ రెడ్డి:ఒక తలుపు తెరిచాం. గేట్లు అన్నీ తెరవలేదు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేది పార్టీ ఆదేశిస్తుంది. దాన్ని బట్టి మేం ముందుకెళ్తాం.

  • 25 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్‌ చెబుతున్నారు. మీ ఎమ్మెల్యేలు ఏమైనాబీఆర్​ఎస్తో టచ్‌లో ఉన్నారా?

రేవంత్ రెడ్డి:కేసీఆర్‌ చెప్పింది వాళ్ల ఎమ్మెల్యేల గురించి. మా ఎమ్మెల్యేల గురించి కాదు. బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు టచ్‌లో లేకుండా బయట తిరుగుతున్నారు కదా. అందులో 25 మంది టచ్‌లోనే ఉన్నారని ఆయన అన్నారు. కేసీఆర్‌ది దింపుడుకళ్లెం ఆశ. ఇలాగైనా పార్టీని కాపాడుకుందామనే ప్రయత్నం చేస్తున్నారు.

  • కక్ష సాధింపు అనే పదం రాకుండా రేవంత్‌రెడ్డి న్యాయవిచారణ పేరిట పకడ్బందీగా వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి:అవినీతి జరిగిందంటే ఎవరు నిర్ధారించాలి? రాజకీయంగా మేం నిర్ధారిస్తే అపోహలుంటాయి. అందుకే సంబంధిత ఏజెన్సీలతో విచారణ జరిపిస్తున్నాం. వారిచ్చే నివేదికల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటాం. వ్యక్తిగత కక్షలకు తావు లేదు. అలాంటి చర్చకు కూడా నేను ఆస్కారం ఇవ్వదలుచుకోలేదు. నాకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కోపం లేదు. నన్ను ఎవరన్నా ఇబ్బంది పెట్టినా నేను పట్టించుకోను. నెగెటివ్‌ పాలిటిక్స్‌కు, వ్యక్తులకు నష్టం చేసే విధానాలకు నేను విరుద్ధం. తప్పు జరిగినట్లు విచారణ సంస్థలు నిర్ధారిస్తే.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. దానికి నాతో సహా ఎవరూ అతీతులు కాదు. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యుత్‌, ధరణిలపై విచారణ చేయిస్తున్నాం.

  • కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఏం చేయనున్నారు?

రేవంత్ రెడ్డి:దుబారా తగ్గించుకోవాలి. ప్రాజెక్టుల ప్రాధాన్యక్రమంలో ఎంపిక చేసుకోవాలి. 80 శాతం పూర్తయిన ప్రాజెక్టుల్లో 20 శాతం పనులను తొలుత పూర్తిచేసి అందుబాటులోకి తెస్తాం. తర్వాత క్రమంలో 60 శాతం పూర్తయినవి, వాటి తర్వాత 40 శాతం, ఇలా ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయడంపై దృష్టిపెట్టాం. అన్నిటినీ ఒకే రకంగా చూస్తే, పెండింగులోనే ఉండిపోతాయి. అందుకే ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించి.. క్రమబద్ధంగా పూర్తిచేస్తాం. దీనివల్ల తెలంగాణకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కేసీఆర్‌లా నేను ఆర్భాటపు ప్రచారాల జోలికి పోను. మేం ఏం చేశామన్నది, కనీసం ఒక ఏడాది తర్వాతే కనిపిస్తుంది.

  • మీ హామీలను అమలు చేయడానికి ఆదాయం ఉందా?

రేవంత్ రెడ్డి: ఆదాయం పెంచాలి. పేదలకు పంచాలి అనేది మా విధానం. పన్నులు ఎగ్గొడుతున్న వారిని నియంత్రిస్తే, కొత్తగా పెట్టుబడులు తెస్తే ఆదాయం పెరుగుతుంది. కేసీఆర్‌లా దుబారా వ్యయం చేయకుండా తగ్గించుకుంటే ఆదాయం పక్కాగా సరిపోతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.వేల కోట్లు మ్యాచింగ్‌ గ్రాంట్లుగా వస్తాయి. వారు ఇచ్చే నిధులకు 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం జత చేస్తే సరిపోతుంది. ఈ నిధులను కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టాలని ఆర్థికశాఖకు చెప్పాను. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద అన్ని రాష్ట్రాలకు ఏటా వచ్చే రూ.15 వేల కోట్లు కూడా కేసీఆర్‌ ఎప్పుడూ తీసుకోలేదు.

  • కాంగ్రెస్‌ను దెబ్బకొట్టడానికి బీజేపీతో బీఆర్​ఎస్ కుమ్మక్కైందని మీరు ఆరోపించారు.

రేవంత్ రెడ్డి:అవును. మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్‌లలో ఆ పార్టీ ప్రచారం, అభ్యర్థుల స్థితి చూడండి. వాళ్లకు బీఆర్​ఎస్ పార్టీ పరంగా ఏం మద్దతిస్తున్నారు? మొన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో ఏం మాట్లాడారో మీరు చూశారు. దీని వెనుక చాలా వ్యూహం ఉందని కేటీఆర్‌ అంటున్నారు. ఏం వ్యూహం రాజేందర్‌ను గెలిపించే వ్యూహమా?

  • ప్రభుత్వాన్ని కూలగొడతారని మీ వద్ద ఏమైనా సమాచారం ఉందా?

రేవంత్ రెడ్డి:మీ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూస్తాం అని, కేసీఆర్‌, కేటీఆర్‌, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డిలు బహిరంగంగానే అంటున్నారు కదా.. అదే నాకు సమాచారం. నేను ఇంతదూరం వచ్చానంటే కాంగ్రెస్‌ కార్యకర్తల కష్టమే కారణం. అందుకే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని, కూలగొట్టేవారు ఊళ్లలోకి వస్తే వీపులు పగులగొట్టాలని కార్యకర్తలకే చెబుతున్నా.

'ప్రశ్నించే నాయకుడు ఏపీలో లేరు - ఉక్కు ప్రైవేటీకరణను తెలుగువాళ్లం అందరం కలిసి అడ్డుకుందాం'

ABOUT THE AUTHOR

...view details