CM Revanth Reddy Seoul Tour Ends Today : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చించనున్నారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం సోమవారం రాత్రి చియోన్ జి చియోన్ స్ట్రీమ్‌ను సీఎం పరిశీలించారు.
సియోల్‌లోని చుంగ్ గే చంగ్ నది పరిసరాలను సీఎం రేవంత్ సందర్శించారు. నది సుందరీకరణ తీరుతెన్నులను తెలుసుకున్నారు. నేడు హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్‌తో సమావేశం కానున్నారు. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం బృందం సందర్శించనుంది. దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని రాత్రి సింగపూర్ మీదుగా బయలుదేరి, బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం, దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్‌లు, మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది.
ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ : అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. ప్రముఖ బహుళ జాతి సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్‌సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్, ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.