తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

ETV Bharat / state

బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులకు నేడే శ్రీకారం - ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి - BFSI COURSES LAUNCH IN TELANGANA

BSFI Courses Launch In Telangana Today : డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఏటా అనేకమంది విద్యాసంస్థల నుంచి బయటకొస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు. పరిశ్రమల అవసరాలకు సరిపడేలా శిక్షణ అందిస్తే కొలువులు సంపాదించవచ్చు. ఇందులో భాగంగానే బీఎఫ్​ఎస్​ఐ(బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌) రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. ప్రత్యేకంగా మైనర్ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు.

CM Revanth will Launches BFSI Courses
CM Revanth will Initiate Minor Degree Courses (ETV Bharat)

CM Revanth To Launche BFSI Courses Today : ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో ఏటికేడు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. అదేస్థాయిలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. ఇందుకు ప్రధాన కారణం నైపుణ్యాల లేమి. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసులు, ఇన్సురెన్స్ రంగాల్లో నిపుణుల కొరత వేధిస్తోంది. ఈ సమస్య అధిగమించేందుకు మైనర్‌ డిగ్రీలను అందించే కార్యక్రమానికి ప్రభుత్వం ఇవాళ శ్రీకారం చుట్టనుంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి మాసబ్‌ ట్యాంక్‌లోని జేఎన్​టీయూ ఫైన్‌ఆర్ట్స్‌ కాలేజీలో ఈ కోర్సులను ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 38 కళాశాలల్లో బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో నైపుణ్య శిక్షణ అందించే కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం 18 ఇంజినీరింగ్ మరో 20 డిగ్రీ కళాశాలలను ఎంపిక చేశారు. ఐదు వేల మంది బీటెక్, మరో 5వేల మంది డిగ్రీ విద్యార్థులకు ఈ కోర్సులు నేర్పించనున్నారు.

బీటెక్ సెకండ్, థర్డ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి ఇందులో శిక్షణ అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఎఫ్​ఎస్​ఐ సెక్టార్‌ కోర్సులో అందించేందుకు డిగ్రీ విభాగంలో హైదరాబాద్‌లో 12 కాలేజీలు ఎంపికయ్యాయి. వాటిలో తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, భవన్స్ డిగ్రీ కాలేజీ, సీటీ కాలేజ్, నిజాం కాలేజీ, సెయింట్ ఆన్స్, సెయింట్ ఫ్రాన్సిస్, సెయింట్ పీఎస్ ఎక్స్ కళాశాలలు, ఆర్​బీవీఆర్​ఆర్​ డిగ్రీ కాలేజీ, బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఖైరతాబాద్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నాంపల్లి ఇందిరా ప్రియదర్శిని మహిళా డిగ్రీ కాలేజీ ఉన్నాయి.

విద్యార్థుల వివరాలతో ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్ : ఇక జిల్లాల నుంచి హన్మకొండ పింగళి ప్రభుత్వ కళాశాల, ఖమ్మం నుంచి ఎస్​ఆర్​ అండ్ బీజీఎన్​ఆర్​ ప్రభుత్వ కళాశాల, మహబూబ్‌నగర్‌ ఎంవీఎస్​ కాలేజీ, కరీంనగర్ ఎస్​ఆర్​ఆర్​ కాలేజీ, నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డిల్లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు నిలిచాయి. ఇంజినీరింగ్ విభాగంలో ఎంపిక చేసిన 18 కాలేజీల్లో 10 జేఎన్​టీయూ అనుబంధ, ఆరు ఓయూ కళాశాలలతో పాటు ఆర్జీయూకేటీ, వరంగల్ కిట్స్‌లో కోర్సులు అందుబాటులోకి తేనున్నారు.

హైదరాబాద్‌లో జేఎన్​టీయూహెచ్‌తోపాటు ఓయూ ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు సీబీఐటీ, బీవీఆర్‌ఐటీ, నారాయణమ్మ, గోకరాజు గంగరాజు వంటి కళాశాలల్లో కోర్సులు నేర్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణంతోపాటు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సైతం కోర్సులు అందించేలా కళాశాలలను ఎంపిక చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మైనర్ డిగ్రీలో శిక్షణ తీసుకున్న విద్యార్థుల వివరాలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్ రూపొందించనుంది. అందులో విద్యార్థుల బయోడేటాతోపాటు చదువుతున్న కాలేజీ, వారి విద్యార్హతలు, సాంకేతిక కోర్సుల అనుభవ వివరాలను పొందుపరచనున్నారు.

పోర్టల్ ద్వారా విద్యార్థులకు నేరుగా ఇంటర్వ్యూ :ఫలితంగా బీఎఫ్​ఎస్​ఐ రంగంలోని ప్రముఖ సంస్థలు ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులను నేరుగా ఇంటర్వ్యూ చేసేందుకు వీలు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి ఏడాది ఈ కోర్సుల్లో 10వేల మంది శిక్షణ తీసుకోనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడకుండా ఎక్విప్ అనే సంస్థ రూ. 2.50 కోట్లు అందించేందుకు ముందుకు రాగా మిగత మొత్తాన్ని సైతం సీఎస్‌ఐఆర్ ద్వారా సమకూర్చనున్నారు.

ABOUT THE AUTHOR

...view details