CEO Vikas Raj on Lok Sabha Election Nominations Process : నేడు సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తొలి రోజు పలువురు నామినేషన్లు సైతం దాఖలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పలు సూచనలు చేశారు.
Vikas Raj on Parliament Elections 2024 : ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్లు వేయవచ్చని వికాస్‌రాజ్ తెలిపారు. అయితే వాటిని ఈ నెల 24లోగా ప్రింట్ తీసుకుని సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాలని సూచించారు. నామినేషన్ పత్రాలు, అఫిడవిట్ జాగ్రత్తగా నింపాలన్నారు. మూడు సెట్ల నామినేషన్ పత్రాలు ఇవ్వొచ్చన్న ఆయన, వాటితో పాటు 5 ఫొటోలు ఇవ్వాలని చెప్పారు.
తొలిరోజు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ - నామపత్రాలు దాఖలు చేసిన ఈటల, డీకే అరుణ, రఘునందన్‌రావు
అభ్యర్థులు ఇచ్చే ఫొటోలు స్పష్టంగా ఉండాలని, టోపీలు, కళ్లద్దాలు పెట్టుకుని ఉన్న ఫొటోలు ఇవ్వకూడదని వికాస్‌రాజ్ తెలిపారు. అఫిడవిట్‌లోని ప్రతి పేజీలో అభ్యర్థులు సంతకం చేయాలని సూచించారు. ప్రతి కాలమ్ నింపాలని చెప్పారు. ఎన్నికల ఖర్చుపై అభ్యర్థి బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాలన్న ఆయన, రాష్ట్రంలో ఎక్కడైనా అకౌంట్ తెరవొచ్చని, ఎన్నికల ఖర్చులన్నీ ఆ బ్యాంకు ఖాతా ద్వారానే జరపాలని స్పష్టం చేశారు.