Telangana Cabinet Approval For Rythu Runa Mafi : గత ఐదేళ్లుగా పంట రుణాలు తీసుకున్న రైతులకు రాష్ట్ర మంత్రివర్గం శుభవార్త తెలిపింది. రూ.2 లక్షల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రైతు రుణమాఫీ చేయనున్నట్లు 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేసి తీరతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల పార్లమెంటు ఎన్నికల సమయంలో ప్రకటించడంతో పాటు పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. రుణమాఫీకి నిధుల సమీకరణ, విధివిధానాలు, అర్హతలపై కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులు, బ్యాంకర్లు, నిపుణులతో చర్చలు జరిపారు. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గంలో వివిధ అంశాలు చర్చించి 2018 డిసెంబరు 12 నుంచి గతేడాది డిసెంబరు 9 వరకు తీసుకున్న రుణాలను రద్దు చేయాలని మంత్రులు నిర్ణయం తీసుకున్నారు.
Cabinet Approvals 2024 in Telangana : రుణమాఫీ అర్హతలు, విధి విధానాలపై నేడో, రేపో ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది. రైతు సంక్షేమం కోసం రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్లుగా రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదని, తమ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే మాట నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి అన్నారు. అటు రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఉపసంఘం నివేదికపై బడ్జెట్ సమావేశాల్లో చర్చించి రైతు భరోసాపై తుది నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.