Telangana Budget on Six Guarantees : తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో, శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్లుగా బడ్జెట్ (Telangana Budget) ఉంది. ప్రత్యేకించి ఆరు హామీలకు పద్దులో ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం రూ.53,196 కోట్లను రాష్ట్ర సర్కార్ కేటాయించింది.
Telangana Budget 2024 : తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, గృహజ్యోతి పథకం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, యువ వికాసం పథకం, చేయూత పథకాలు ఉన్నాయి. అందులో రెండు హామీలను ఇప్పటికే అమలు చేసిన ప్రభుత్వం, మరో రెండింటిని త్వరలోనే అమలు చేయనుంది. అన్ని గ్యారంటీలను వంద రోజుల్లోగా అమలు చేస్తామని సర్కార్ తెలిపింది. దీంతో వీటి అమలుకు బడ్జెట్‌లో నిధులను కేటాయించింది.
త్వరలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ - గృహజ్యోతి పథకానికి ఎన్ని నిధులు కేటాయించారంటే?
అర్హులైన అందరికీ ఆరు హామీలు అందుతాయని ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. మహాలక్ష్మి పథకం కోసం ఆర్టీసీకి ప్రభుత్వం నెలకు రూ.300 కోట్లు చెల్లిస్తోందని చెప్పారు. ఆరోగ్యశ్రీకి అవసరమైన నిధులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గృహజ్యోతి (Gruha Jyothi Scheme) ద్వారా అర్హులందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కోసం రూ.2,418 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తామని భట్టి విక్రమార్క వివరించారు.