Telangana BJP Chief Kishan Reddy Comments on BRS : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) పోటీ చేయాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎలాంటి అజెండా లేదని చెప్పారు. బీఆర్ఎస్కు ఒక సీటు రాకపోయినా జనానికి వచ్చే నష్టం ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. కృష్ణా క్లస్టర్ విజయ సంకల్ప యాత్ర(BJP Vijaya Sankalpa Yatra) రెండో రోజు సందర్భంగా నారాయణపేటలో మాట్లాడారు. ఈ సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రధాని అభ్యర్థి ఎవరో తెలియదని, ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్‌లో అన్ని ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కర్ణాటకలో 25 సీట్లు గెలుస్తున్నామని, తెలంగాణలో కాంగ్రెస్ 3-4 పార్లమెంటు సీట్లు(Loksabha Election 2024) గెలిచినా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని తెలిపారు. తెలంగాణలో 17 స్థానాల్లో గెలిచేందుకే బీజేపీ పోటీ చేస్తోందని, ఏ పార్టీతో పొత్తు ఉండబోదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధిక సీట్లు కమలం పార్టీ గెలవకుండా ఏ శక్తీ అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు.
BJP Vijaya Sankalpa Bus Yatra :ఓవైసీలు, కేసీఆర్‌లు, రాహుల్ ఎవరూ మోదీని మరోసారి ప్రధాని కాకుండా ఆపలేరన్నారు. ఇక్కడ అప్పుడే కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని దుయ్యబట్టారు. అమలు కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. సోనియా కుటుంబానికి సేవ చేయడం తప్ప, హామీల అమలుపై కాంగ్రెస్(Congress) దృష్టి పెట్టలేదని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పాలని కాంగ్రెస్ నాయకులను నిలదీశారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ సహా ఇతర హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం(Woman Free Bus) ద్వారా మాత్రమే ప్రజల జీవితాలు బాగుపడవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.