Telangana Assembly Session Arrangements: రేపు తెలంగాణ శాసనసభ సమావేశాలు మరోసారి ప్రారంభం కానున్నాయి. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులర్పించడం కోసం రేపు ప్రత్యేకంగా సమావేశమవుతుంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శాసనసభ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీ పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, గతంలాగానే ఈ సమావేశాలు సజావుగా జరిగే విధంగా చూడాలని తెలిపారు. ప్రభుత్వ అధికారులతో సమన్యయం చేసుకుని సమావేశాలు ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులకు సభాపతి ప్రసాద్ కుమార్ సూచించారు.
మన్మోహన్ సింగ్‌కు నివాళి అర్పించనున్న సభ : ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు శనివారం లేఖల ద్వారా సమాచారం ఇచ్చారు. శాసనసభ నాలుగో విడతలో రెండో సమావేశంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని కోరారు. శాసనసభ కార్యకలాపాల నిర్వహణ విధానంలోని 16 నియమం కింద గల రెండో నిబంధన అధికారాల మేరకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ సోమవారం ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కార్యదర్శి పేర్కొన్నారు.