Assembly Approved Vote on Account Budget 2024-25 : రాష్టప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2024-25కు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఇవాళ బడ్జెట్‌పై చర్చలు జరిగిన అనంతరం ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం శాసనసభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రేపటికి వాయిదా వేశారు.
TS Vote on Account Budget 2024-25 : తెలంగాణ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను గత శనివారం ఉభయసభల్లో ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలోనూ, శాసన మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర పద్దును ప్రవేశపెట్టారు. రూ.2,75,891 కోట్ల బడ్జెట్‌ను (Telangana Budget) ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లలుగా ప్రతిపాదించారు.
అసెంబ్లీలో ఇవాళ్టి చర్చకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. తెలంగాణలో ఆర్థిక, సామాజిక అసమానతలు ఉన్నాయని, వాటిని తొలగించేందుకు బడ్జెట్‌లో కృషి చేశామని వివరించారు. గతంలో బడ్జెట్‌లో కేటాయింపుల మేరకు నిధులు అందని పరిస్థితి ఉండేదని, అలాంటి పరిస్థితి రాకుండా వాస్తవ బడ్జెట్ రూపొందించామని వెల్లడించారు. సామాజిక సమానత్వంలో భాగంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపామని స్పష్టం చేశారు. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఏడోరోజులో భాగంగా బడ్జెట్‌పై చర్చకు భట్టి విక్రమార్క సమాధానం ఇచ్చారు.