TGNAB Focus On Drugs In Hyderabad :రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినిపించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయగా వాటి నిర్మూలనకు ఏర్పాటైన యాంటీ నార్కొటిక్ బ్యూరో మాదకద్రవ్యాల మూలాలనే పెకలించే పనిలో ఉంది. ఇందుకోసం బ్యూరో అధికారులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారు. డ్రగ్స్ సేవిస్తున్న, విక్రయిస్తున్న వారు ఎంతటి వారైనా పోలీసులు ఉపేక్షించడం లేదు. కొన్ని నెలలుగా కీలక ఆపరేషన్లు టీజీ న్యాబ్ నిర్వహించింది.
డ్రగ్స్ సరఫరాపై పోలీసుల ఉక్కుపాదం :ఇటీవల హైటెక్ సిటీ నోవాటెల్‌లోని ఆర్టిస్ట్రీ పబ్ డ్రగ్ పార్టీలకు హాట్ స్పాట్‌గా ఉన్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టింది. ముగ్గురు వినియోగదారులను అరెస్ట్ చేశారు. మణికొండలోని కేవ్ పబ్‌లో చేసిన రైడ్‌లో 52 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా వారిలో 33 మందికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. వారంతా గంజాయి, కొకైన్ సేవించినట్లు గుర్తించారు. పలు విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్ సేవిస్తున్న విద్యార్థులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని వారిలో పరివర్తన కోసం కౌన్సిలింగ్ ఇచ్చారు.
TGNAB Officials Focus On Drugs Control :నెల రోజుల క్రితం షాద్‌నగర్‌లోని సింబయాసిస్ కళాశాలో ఓజీ వీడ్ డ్రగ్ వినియోగిస్తున్న 25 మంది వైద్య విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఉస్మానియా ఆస్పత్రిలో ఓజీ వీడ్ డ్రగ్ సేవిస్తున్న ఆరుగురు జూడాలను టీజీ న్యాబ్ పోలీసులు పట్టుకున్నారు. వీరిపై మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు. గురునానక్ కళాశాలలో గంజాయి సేవిస్తున్న 15 మంది విద్యార్థులను గుర్తించిన పోలీసులు వారిని రిహ్యాబిలిటేషన్ సెంటర్‌కు పంపారు.
ఈ- సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు :కుందన్‌బాగ్‌లో ఉన్న కలినరీ అకాడమీలోని నలుగురు విద్యార్థులకు గంజా పాజిటివ్ వచ్చింది. సీబీఐటీలో ఒకరు, బాసర ట్రిఫుల్ఐటీలో పలువురు, జేఎన్టీయూ జోగిపేటలోని ముగ్గురు విద్యార్థులకు గంజా పాజిటివ్ వచ్చినట్లు టీజీ న్యాబ్ పోలీసులు తెలిపారు. సీబీఐటీ, ఇండస్ స్కూలు విద్యార్థులకు కోడ్ భాషలతో ఈ- సిగరెట్లు విక్రయిస్తున్న అహ్మద్, జాఫర్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.