Lok Sabha MPs Oath Ceremony 2024 :18వ లోక్‌సభ సమావేశాల్లో తొలిరోజు పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ, ఏపీ నుంచి లోక్‌సభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో పలువురు పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు తెలుగులో ప్రమాణం చేశారు. మరోవైపు టీడీపీ ఎంపీ ఏకంగా సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకుని పార్టీపై తన అభిమానాన్ని చాటుకున్నారు.
తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు ఇవాళ ప్రమాణం చేశారు. కిషన్ రెడ్డి తెలుపు రంగు పంచెకట్టులో పార్లమెంటుకు చేరుకోగా, బండి సంజయ్ ఎప్పటిమాదిరి వైట్ కలర్ డ్రెస్సులో వచ్చారు. ఈ ఇద్దరూ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా, చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ కేంద్ర సహాయ మంత్రి గతంలోనే బాధ్యతలు స్వీకరించారు.