Teachers for Took Holiday to Children : పిల్లలకు విద్యాబుద్ధులు, పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే.. పిల్లలను ఇంటికి వెళ్లిపోమని చెప్పి దావత్‌లు చేసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. హైదరాబాద్ జిల్లాలోని షేక్‌పేట్ మండల పరిధిలోని ఈ ఘటన జరిగింది. దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ చేపట్టి బాధ్యులైన డీఐఓఎస్ యాదగిరిని సస్పెండ్ చేయడంతో పాటు ఉపాధ్యాయులకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈ విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్ జిల్లాలోని షేక్ పేట్ మండల పరిధిలోని 20 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ ఈ నెల 13న ఆ పాఠశాలల్లో విధులు నిర్తిస్తున్న 80 మంది సెకెండ్ గ్రేడ్ టీచర్లు, ప్రధానోపాధ్యాయులతో పాటు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్(డీఐఓఎస్) యాదగిరి కలిసి దావత్ చేసుకోవాలని అనుకున్నారు. అందుకు అనువైన ప్రదేశంగా బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఆ 20 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు.