TDP Workers Celebrations: రాష్ట్రంలో కూటమి అఖండ విజయంతో నేతలు,కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అభిమానులు, నాయకులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గెలుపొందిన కూటమి నేతలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని,ఎన్నికల్లో విజయం సాధించారన్న ఆనందంతో, ఆయన అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు... తిరుమలలో శ్రీవారికి 501 కొబ్బరికాయలు కొట్టి మెుక్కులు చెల్లించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా నెలవల విజయశ్రీ విజయం సాధించడంతో అభిమానులు ఆమె ఇంటివద్దకు వచ్చి శాలువాలతో సత్కరించారు.
అనంతపురంలో తెలుగుదేశం, జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 10వ డివిజన్‌లో తెలుగుదేశం శ్రేణులు కేక్ కోసి సంబరాలు చేసుకున్నాయి. ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలుపుతో ఆయన అభిమానులు పెన్నఅహోబిళం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పాదయాత్ర చేశారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావటంతో, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని, కొత్తచెరువుకు చెందిన ఓ సామాన్యుడు తన ఆనందాన్ని వినూత్నంగా పంచుకున్నారు. స్థానికంగా టీ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగించే నజీర్... మండలంలోని ప్రజలందరికీ టీ ఉచితంగా అందించారు. చంద్రబాబుపై తనకున్న అభిమానంతో ఆయన సీఎం కావాలనే ఆకాంక్షతో టీ ఉచితంగా ఇచ్చినట్లు నజీర్ తెలిపారు.
వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్‌లో కూటమి నాయకులు ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసి 101 కొబ్బరికాయలు కొట్టి... మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవటంతో వైఎస్ఆర్ కడపజిల్లా చక్రాయపేట మండలం గండి క్షేత్రంలో తెలుగుదేశం నాయకులు పదివేల 101 కొబ్బరికాయలు కొట్టారు.
'ప్రజల తీర్పు నిశ్శబ్ద విప్లవం'- వైఎస్సార్సీపీ ఘోర పరాజయంపై టీడీపీ స్పందన - TDP LEADERS REACTION
రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు (ETV Bharat) నంద్యాల జిల్లా పాణ్యంలో గౌరు చరిత విజయం సాధించటంతో తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు టపాసులు కాల్చారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. విజయం సాధించిన కర్నూలు లోక్‌సభ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, పత్తికొండ అభ్యర్థి కేఈ శ్యాంబాబులను ఘనంగా సన్మానించారు. కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం విజయంతో ఆ పార్టీ నాయకులు చంద్రబాబు, పవన్ కల్యాణ్, నరేంద్ర మోదీ, లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కూటమి భారీ విజయాన్ని ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో సంబరాలు అంబరాన్నంటాయి. స్థానికంగా ఉన్న ప్రసన్న గంగమ్మ ఆలయంలో తెలుగుదేశం నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. M.L.A.గా చంద్రబాబు విజయం సాధించిన ధృవీకరణ పత్రాన్ని అమ్మవారి ఎదుట ఉంచి పూజలు చేశారు. తర్వాత స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత బస్టాండ్‌లోని N.T.R. విగ్రహానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. కూటమి శ్రేణులు టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తపరిచాయి.
ఈనెల 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం! - Chandrababu Will Take Oath As AP CM On June 9