TDP Neelayapalem Vijay Kumar Fires on YSRCP: జగనేమో రాష్ట్రంలో విద్యావిధానం గొప్పగా ఉందంటున్నారని కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి లక్షల సంఖ్యలో విద్యార్థులు వెళ్లిపోతున్నారని టీడీపీ నేత ఎన్.విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఏకంగా 4.5 లక్షల మంది విద్యార్థులు తగ్గారని విజయ్ కుమార్ అన్నారు. బైజూస్ కంటెంట్, ఐబీ విద్యా విధానం కాదని ముందు విద్యార్థుల శాతం పెంచండని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థులు తగ్గిపోతూ వస్తున్నారని విజయ్ కుమార్ తెలిపారు.
2021-22లో 43 లక్షల మంది విద్యార్థులు ఉన్నారన్న విజయ్ కుమార్, ప్రభుత్వ బడుల్లో ఇప్పుడున్నది 37 లక్షల 80 వేల మంది విద్యార్థులు మాత్రమే అని అన్నారు. గత రెండేళ్లలో పెద్దఎత్తున ప్రభుత్వ బడుల్లో తగ్గిపోయారని, తగ్గిన విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లకు లేదా పూర్తిగా విద్యకే దూరం అయ్యి ఉండాలని విజయ్ విమర్శించారు. నాడు-నేడు అంటే పిల్లలను ప్రభుత్వ పాఠశాలల నుంచి తగ్గించడమేనా అంటూ మండిపడ్డారు.
ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా జగన్? రాష్ట్రంలో మూత'బడు'లు - చదువులకు దూరం అవుతున్న పిల్లలు
మొదట్లో కార్పొరేట్ స్కూళ్లకంటే అందంగా తీర్చిదిద్దుతామన్నారు అని అన్నారని తీరా ఇప్పుడు విద్యార్థులు ఇలా వెళ్లిపోవడమేంటో సీఎం జగన్మోహన్ రెడ్డే సమాధానం చెప్పాలని ధ్వజమెత్తారు. కనీసం ఒక్క టీచర్ రిక్రూట్‌మెంట్ కూడా చేపట్టలేదేంటి జగన్ గారూ అంటూ ప్రశ్నించారు. 3, 4, 5వ తరగతులను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేశారన్న విజయ్, విలీనం వల్ల 1, 2 తరగతుల్లో విద్యార్థులు తగ్గి స్కూళ్లు మూతబడ్డాయని ఆరోపించారు.