TDP Leaders Respond On Ex Mla Vallabhaneni Vamsi Arrest : అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన నోరుపారేసుకున్న వంశీకి ఇప్పటికి సరైన గతి పట్టిందని తెలుగుదేశం నేతలు అన్నారు. గత ఐదేళ్లలో గన్నవరంలో వంశీ చేయని అరాచకం లేదన్న టీడీపీ నేతలు రాజకీయ భిక్షపెట్టిన తెలుగుదేశం పార్టీ కార్యాలయంపైనే దాడికి దిగడం దారుణమన్నారు. పైగా దళితుడైన ఫిర్యాదుదారుని కిడ్నాప్ చేసి బెదిరించి కేసు వెనక్కి తీసుకునేలా చేయడం క్షమించరాని నేరమన్నారు. చేసిన పాపాలకు వంశీ ఫలితం అనుభవించక తప్పదన్న నేతలు గత ఐదేళ్లలో గన్నవరంలో జరిగిన మట్టి దందా, అక్రమ కబ్జాలు, దారుణాలపై విచారణ జరిపించాలని ముఖ్యమంత్రిని కోరతామని తెలిపారు.
శాశ్వతంగా కటకటాల్లోకి :తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన క్రూరమృగం వల్లభనేని వంశీ అని తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇలాంటి వ్యక్తిని 9 నెలలుగా ఎందుకు వదిలేశారో అర్థంకావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ మాట్లాడిన భాష, చేసిన నేరాలు, అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో దర్యాప్తు చేయించి శాశ్వతంగా కటకటాల్లోకి నెట్టాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. గతంలో అధికారం అండతో వంశీ తనపై దాడికి పన్నిన పన్నాగంపై కేసు పెట్టినా పోలీసులు తీసుకోలేదన్న నాదెండ్ల బ్రహ్మం ఇప్పుడు ఆ కేసులోనూ దర్యాప్తు ప్రారంభించాలని పోలీసుల్ని కోరారు.
వారిని వదిలే ప్రసక్తే లేదు : దాడికి ప్రతి దాడి, కక్ష తీర్చుకునే అవసరం టీడీపీకి లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందన్న ఆయన, కక్ష సాధింపు చేస్తే వచ్చిన నెల రోజుల లోపే అరెస్టు చేసి ఉండొచ్చని అన్నారు. తప్పు చేసిన వారు తప్పించుకునే పరిస్థితి లేదని అన్నారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి దానిని వెనక్కు తీసుకోవడం తమ అందరికీ ఆశ్చర్యం కలిగించిందన్నారు. సత్యవర్ధన్ తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీకి చెందిన కార్యకర్తలు, నేతలను తీవ్ర స్థాయిలో వేధించారని గుర్తుచేశారు. ఎవరు తప్పు చేసినా వారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.
ఎవరెవరితో ఫోన్ మాట్లాడాడో? : గన్నవరం వంశీ పాపాలపుట్ట బద్దలైందని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పెద్ద సైకో జగన్ డైరక్షన్ లో వ్యవహరించిన చిన్న సైకో వంశీ కటకటాల పాలయ్యాడని తెలిపారు. ఫిర్యాదుదారుడినే కిడ్నాప్ చేసి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి, చట్టాన్నే కించపరిచాడని ధ్వజమెత్తారు. వంశీ అరెస్ట్ సమయంలో గదిలోకి వెళ్లి తలుపులేసుకుని ఎవరెవరితో ఫోన్ మాట్లాడాడో కాల్ డేటా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. వంశీతో పాటు కొడాలినాని, పేర్ని నాని లాంటి వాళ్లు జైలుకెళ్లే సమయం దగ్గరపడిందని వెల్లడించారు.
నోరుంది కదా అని బూతులు : గన్నవరం పార్టీ కార్యాలయం తగలపెట్టి చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకు వంశీ మరో నేరానికి పాల్పడ్డాడని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. అధికారం అండతో వైఎస్సార్సీపీ నాయకులు కృష్ణా జిల్లాలో పెట్రేగిపోయారని దుయ్యబట్టారు. ఒక నాయకుడు క్యాసినో పెట్టి నోరుంది కదా అని బూతులు తిట్టాడు,మరో నాయకుడు బియ్యం స్కామ్ లో కట్టుకున్న భార్యనే ఇరికించాడన్నారు. ఇంకో నాయకుడు పార్టీ కార్యాలయం పై దాడికి పాల్పడతాడు ఈ చర్యలన్నీ ఉపేక్షించాలా? అని ప్రశ్నించారు. కక్షపూరితంగా చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే అందరినీ లోపల వేయించేవాళ్లమని తెలిపారు.