TDP- Janasena Leaders Comments on YCP Government:సీఎంజగన్‌ను గద్దె దించేందుకు తెలుగుదేశం- జనసేనలతో జత కడుతున్నట్లు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వెల్లడించారు. కూటమి అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కృష్ణార్జునుల్లా, అభినవ కౌరవులైన వైసీపీ అభ్యర్థులైన 151మందిని ఎన్నికల సంగ్రామంలో తుదముట్టిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం- జనసేన కూటమి కలిసికట్టుగా తొలిసారి ఏర్పాటు చేసిన ప్రచార సమరశంఖం సభకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మూడు రాజధానులని చెప్పి వాటి అడ్రస్సే లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిని చరిత్ర పుటల్లో కలిసే సమయం వచ్చిందని ఆయన అన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని డ్రగ్స్‌కు రాజధాని చేశారని రఘరామ ఎద్దేవా చేశారు.
సభా వేదికపై చంద్రబాబు, పవన్ - పార్టీ జెండాలు ఊపి శ్రేణుల్లో ఉత్సాహం
Balakrishna: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, ఇందుకు ప్రజలంతా సిద్ధమని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం కార్యకర్తలే అని ఆయన పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు బడుగు బలహీన వర్గాలను అధికార పీఠం పైకి ఎక్కించారని బాలకృష్ణ అన్నారు. వైసీపీ చేస్తున్న నాటకాలను ప్రజలు గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని బాలకృష్ణ మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ-జనసేన కూటమిని ప్రజలు ఆశీర్వదించాలని బాలకృష్ణ కోరారు.
ఇక సీఎం జగన్‌కు మిగిలింది 30 రోజులే: బాలకోటయ్య
Achchennaidu:సిద్ధమా అని రోడ్డెక్కిన వ్యక్తిని యుద్ధం చేసి ఓడించేందుకు తాడేపల్లిగూడెం వేదిక తొలి అడుగు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ ' జెండా ' సభ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తున్నామని పేర్కొన్నారు. జనంలో పుట్టినటువంటి టీడీపీ-జనసేన పొత్తు రాష్ట్రంలో చరిత్రను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రజల కోసమే తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నామని ఆయన సృష్టం చేశారు. కార్మికుడి నుంచి పారిశ్రామికవేత్త వరకు టీడీపీ - జనసేన పొత్తు కోరుకుంటున్నారని అచ్చెన్నాయుడు తెలియజేశారు. జగన్ పాలనలో మోసపోయిన రైతులు, యువత, నిరుద్యోగులు, మహిళలు కోరుకున్న పొత్తు అని పేర్కొన్నారు. రెండు పార్టీలు కలిసి పని చేస్తే 160 స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.