Kidney Disease in Uddanam : ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వ చర్యలు వేగవంతం చేసింది. సరైన నిధులు కేటాయించకపోవడం వల్ల ఐదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో ఆగిపోయిన పరిశోధనలను తిరిగి పట్టాలెక్కించింది. వ్యాధి మూలాలపై 2014-19 మధ్య పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన జార్జ్ సంస్థ బృందం కొనసాగిస్తోంది. దీనికి తోడ్పాటు అందించేందుకు కొలంబియా విశ్వవిద్యాలయం ప్రతినిధి, పర్యావరణ రసాయన నిపుణుడు ప్రొఫెసర్ లెక్స్ వన్‌గీన్ పలాస వచ్చారు. ఆయనతో ముఖాముఖి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం.
ప్రశ్న: ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యల బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ప్రభుత్వం కూడా వ్యాధి నియంత్రణకు కృషి చేస్తోంది. పరిశోధనలకు మెండుగా నిధులు కేటాయిస్తోంది. కిడ్నీ సమస్యలపై మీ పరిశోధన ఎలా ఉండనుంది?
జవాబు :యూఎస్ నుంచి తెచ్చిన అధునాతన పరికరాలు ఇక్కడి తాగునీరు, మట్టి, ధూళి నమూనాలను సేకరించడానికి ఉపయోగపడతాయి. శాంపిళ్ల ద్వారా ఇక్కడ సీసం వంటి విషపూరిత లోహాలు, లేదా ప్రమాదకరమైన పురుగుమందుల ఆనవాళ్ల ఆచూకీని కనిపెట్టొచ్చు. ఇవి ఎక్కువగా ఉన్నట్లు తేలితే వ్యాధిగ్రస్తుల అనారోగ్యానికి అదేమైనా కారణమా అనే విషయంపై పరిశోధన చేస్తాం. పర్యావరణానికి, వ్యాధికి మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది చాలా కష్టమైన పని. జన్యుపరమైన అంశాలు సహా అనేక విషయాలు వ్యాధి వ్యాప్తికి కారణం కావొచ్చు. ఓ క్రమ పద్ధతిలో పరిశోధన చేస్తున్నాం.
ఉద్దానం కిడ్నీ ఆస్పత్రిలో వసతుల లేమి - నానా అవస్థలు పడుతున్న రోగులు - Uddanam Kidney Hospital
ప్రశ్న: ఇలాంటి పరిశోధనలు, అధ్యయనాలు గతంలో చేసిన అనుభవం మీకుందా?
జవాబు :ఇలాంటి పరిశోధనల్లో రెండు సార్లు పాల్గొన్నా. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన అధ్యయనం అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థతో జరిగిన ఒప్పందంలో భాగం. ఇలాగే 5 మధ్య అమెరికా దేశాల్లోనూ ఈ ప్రక్రియ సాగుతోంది. వీటిలో ఎల్ సాల్వడార్, కోస్టారికా దేశాల్లో చేపట్టిన పరిశోధనల్లో పాల్గొన్నా. సరిగ్గా అలాంటి బృందంతోనే ఇక్కడ కూడా అధ్యయనం చేపట్టాం. ఉద్దానం ప్రాంతంలో వీలైనంత త్వరగా ఫలితాలు రాబట్టడానికి వేర్వేరు దేశాల్లో అధ్యయనం చేసిన అనుభవం సహకరిస్తుందని నమ్ముతున్నాం.