Supreme Court Dismissed Petitions of Alla Ramakrishna Reddy :ఓటుకు నోటు కేసులో వైఎస్సార్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని పేర్కొంటూ రెండు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసులో భిన్న వాదనల సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని పిటిషనర్‌ను హెచ్చరించింది. ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దని తీవ్ర వాఖ్యలు చేసింది. పిటిషనర్‌కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపై ఆరా తీసింది. పిటిషనర్ 2014 నుంచి ఇటీవల ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా ఉన్నారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీచేసి గెలవాలని ఆళ్లకు ధర్మాసనం హితవు పలికింది.