Sunita Reddy meets YCP leaders: వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లయినా, హంతకులు బయట తిరుగుతున్నారని, వారికి శిక్షలు ఎందుకు పడటం లేదని, జగన్ ఇద్దరు చెల్లెళ్లు షర్మిల, సునీత ప్రశ్నిస్తున్నారు. వివేకా కేసులో అన్ని వేళ్లు అవినాష్‌రెడ్డి వైపే చూపిస్తున్నా, మళ్లీ ఆయనకే కడప వైసీపీ టికెట్ కేటాయించడంతో ఇద్దరు చెల్లెళ్లు జీర్ణించుకోలేక పోతున్నారు. ఫలితంగానే కడప పార్లమెంటుకు కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల బరిలో నిలిచారు.
ఈనెల 5 నుంచి కడప పార్లమెంటు నియోజకవర్గాల్లోవిస్తృతంగా షర్మిల, సునీత ప్రచారం నిర్వహిస్తూ అవినాష్‌రెడ్డి, జగన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. చిన్నాన్నను చంపించిన అవినాష్‌రెడ్డి ఓవైపు న్యాయం కోసం పోరాడుతున్న తాము మరోవైపు ఉన్నామని, ఎవరికి ఓటేస్తారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ప్రజల నుంచి షర్మిల బస్సుయాత్రకు భారీగానే స్పందన వస్తోంది. ఇంతటితో ఆగకుండా కడప పార్లమెంటు పరిధిలో వైసీపీ తరఫున పోటీ చేస్తున్న అవినాష్‌రెడ్డిని ఢీ కొట్టాలంటే ఇతర పార్టీల మద్దతు అవసరమని భావించిన వివేకా కుమార్తె సునీత రాజకీయ పార్టీల ముఖ్య నాయకులను కలుస్తున్నారు. వైసీపీ, కాంగ్రెస్‌తో పాటు తటస్తులను కలిసి మద్దతు కోరుతున్నారు.
మైదుకూరు నియోజకవర్గంలో షర్మిల బస్సు యాత్ర సాగుతుండగానే,. ఖాజీపేటలో మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఇంటికి వెళ్లిన సునీత ఆయనతో సమావేశమయ్యారు. షర్మిల గెలుపు కోసం సహాయం చేయాలని ఆయనను అభ్యర్థించారు. రవీంద్రారెడ్డి సలహాలు, సూచనలు కూడా సునీత తీసుకున్నట్లు సమాచారం. ఇదే గ్రామంలో తెలుగుదేశంకి చెందిన గోవిందరెడ్డి అనే నాయకుడ్ని కలిసి సహకరించాలని కోరారు. మధ్యాహ్నం మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని సునీత కలిశారు. కడప పార్లమెంటు బరిలో నిలిచిన షర్మిలను గెలిపించాలని కోరారు. వివేకానందరెడ్డితో రఘురామిరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో పాటు హత్య జరిగిన రోజు కూడా రఘురామిరెడ్డితో కలిసి వివేకా ఎన్నికల ప్రచారం ముగించుకుని వెళ్లారు. ఆ రోజు రాత్రే వివేకాను హంతకులు చంపేశారు. ఈ విషయాలన్నీ గుర్తుచేసిన సునీత కడప పార్లమెంటు వరకు షర్మిలకు సహకరించాలని కోరినట్లు తెలిసింది.
అన్నపై పోరుకు చెల్లెళ్లు 'సిద్ధం'!- నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం - YS Sharmila Election Campaign
ప్రచారంలో దూసుకుపోతున్న షర్మిల - మద్దతు కూడగడుతున్న సునీత పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సతీశ్‌రెడ్డితోనూ, సునీత భేటీ అయ్యారు. వేంపల్లెలో మంచి ఓటుబ్యాంకు ఉన్న నాయకుడు కావడంతో, షర్మిల గెలుపునకు సహకరించాలని కోరారు. వేంపల్లె వైసీపీ జేడ్పీటీసీ రవికుమార్‌రెడ్డిని కూడా కలిసి మద్దతు కోరారు. పెండ్లిమర్రి మండలం రాజుపాలెం వెళ్లిన సునీత అక్కడ తన బంధువులందరినీ కలిసి మద్దతు కోరారు. కచ్చితంగా షర్మిల గెలుపు కోసం అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల పాటు షర్మిల బస్సుయాత్రకు విరామం ఇస్తున్న సందర్భంగా, ఖాళీగా ఉండకుండా జిల్లాలో ఉన్న ముఖ్యనేతలను కలిసి మద్దతు కోరాలని సునీత ప్రణాళిక వేసుకున్నారు. ఏ పార్టీ వారినీ వదలకుండా మద్దతు కూడబెట్టి కచ్చితంగా కడప ఎంపీగా షర్మిలను గెలిపిస్తేనే, తన తండ్రి ఆత్మకు శాంతి కల్గుతుందని సునీత భావిస్తున్నారు. అవినాష్‌రెడ్డిని ఓడించి హత్యారాజకీయాలకు కడప దూరం అనే సందేశం ఇవ్వాలనే పట్టుదలతో షర్మిల, సునీత ఉన్నారు.
పదవుల కోసం తమ్ముణ్ని చంపితే వైఎస్సార్ తట్టుకునేవారా?: సునీత - YS Sunitha in Election Campaign
ఈనెల12, 13 తేదీలతో షర్మిల బస్సుయాత్ర జిల్లాలో ముగిసిన తర్వాత ఎన్నికలు ముగిసే వరకు మద్దతుదారులతో ప్రతి నియోజకవర్గానికి వెళ్లి ప్రచారం చేయాలని సునీత చూస్తున్నారు. ఎక్కువగా పులివెందుల నియోజకవర్గంలో సునీత ప్రతి వీధికి వెళ్లి ఓపెన్ టాప్ ద్వారా ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారు. అవినాష్‌రెడ్డి చేసిన హత్యారాజకీయాలను ఎండగట్టడంతో పాటు, రాజశేఖర్‌రెడ్డి బిడ్డను గెలిపించాలని సునీత ప్రచారం చేయనున్నట్లు సమాచారం.
నేను బయటకు వెళ్లాక నరికి చంపినా ఆశ్చర్యపడనక్కర్లేదు: సునీత - YS Vivekananda Reddy murder Case