Monthly Expenditure of Families in AP : ఆహారం, ఆహారేతర అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబాలు ప్రతి నెలా గ్రామీణ ప్రాంతాల్లో 5,327 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 7,182 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర గణాంకశాఖ విడుదల చేసిన ‘కుటుంబ వినియోగ వ్యయ సర్వే 2023-24’ రిపోర్టు వెల్లడించింది. జాతీయ స్థాయిలో సగటున ఒక్కో కుటుంబం గ్రామీణ ప్రాంతాల్లో 4,122 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 6,996 రూపాయలు ఖర్చు చేస్తున్నాయి.
దీనికంటే ఆంధ్రప్రదేశ్‌లోని కుటుంబాలే ఎక్కువగా వెచ్చిస్తున్నాయి. అయితే ఏపీ కంటే తెలంగాణలోని కుటుంబాలు చేసే ఖర్చే ఎక్కువగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో కుటుంబం 5,435 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 8,798 రూపాయలు ఖర్చు చేస్తోంది. కేంద్ర గణాంకశాఖ 2023 ఆగస్టు నుంచి 2024 జులై వరకు దేశవ్యాప్తంగా 2,61,953 కుటుంబాలను సర్వే చేసి ఈ రిపోర్టు రూపొందించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో 6,306, పట్టణాల్లో 4,159 ఇళ్లనుంచి వివరాలను సేకరించారు.
ఇల్లు.. EMI వడ్డీలు - సొంత ఇంటికి బారెడు ఖర్చు - మధ్యతరగతిలో తగ్గిన కొనుగోలు శక్తి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ రూపంలో ఉచితంగా అందించే అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఈ అంచనాకు వచ్చినట్లు గణాంకశాఖ వెల్లడించింది. ఒకవేళ ఉచిత పథకాలను పరిగణనలోకి తీసుకుంటే జాతీయ స్థాయిలో సగటు నెలవారీ వ్యయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.4,247, పట్టణ ప్రాంతాల్లో రూ.7,078గా ఉన్నట్లు వెల్లడించింది. ఇదే కొలమానం ప్రకారం ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యయం రూ.5,539, పట్టణ ప్రాంతాల్లో రూ.7,341 ఉన్నట్లు రిపోర్టులో పేర్కొంది. 2022-23తో పోలిస్తే 2023-24లో గ్రామీణ ప్రాంతాల్లో 9 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతం ఖర్చులు పెరిగినట్లు పేర్కొంది.
మొత్తం రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే సిక్కిం ప్రజలు అత్యధికంగా (గ్రామాలు-రూ.9,377, పట్టణాలు-రూ.13,927) ఖర్చు చేస్తున్నారని, ఛత్తీస్‌గఢ్ (గ్రామాలు-రూ.2,739, పట్టణాలు-రూ.4,927) అత్యల్పంగా వ్యయం చేస్తోంది. దేశంలో ఆహారం కోసం గ్రామీణ కుటుంబాలు సగటున నెలకు రూ.1,939 (47.04 శాతం), పట్టణాల్లోని కుటుంబాలు రూ.2,776 (39.68 శాతం) ఖర్చు చేస్తున్నాయి. ఆహారేతర అవసరాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో రూ.2,183 (52.96 శాతం), పట్టణాల్లో రూ.4,220 (60.32 శాతం) ఖర్చు చేస్తున్నాయి. ఇందులో అత్యధిక మొత్తం డ్రింక్స్, రిఫ్రెష్‌మెంట్స్, ప్రాసెస్డ్‌ఫుడ్ కోసం వెచ్చిస్తున్నట్లు రిపోర్టులో వెల్లడించింది.