Suicide in Pedakakani Guntur : ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెదకాకాని వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను పెదకాకానికి చెందిన దానబోయిన మహేశ్ (22), నండ్రు శైలు (21)గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే, పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు, నందిగామ మండలం రుద్రవరా గ్రామానికి చెందిన శైలు అనే యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేశ్ డిప్లొమా చేశాడు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ ప్రముఖ మొబైల్ స్టోర్‌లో పని చేశాడు. ఆ సమయంలో శైలు పరిచయమైంది. వీరు రోజూ మాట్లాడుకునేవారు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇటీవలే వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది.
బయటికి వెళ్లి ప్రాణాలు విడిచి : 10 రోజుల క్రితం యువకుడి ఇష్టం మేరకు తన తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. యువతి కుటుంబసభ్యులు మాత్రం కొంత అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దసరా పండుగ సమయంలో శైలు, మహేశ్ తమ స్వగ్రామాలకు వెళ్లారు. బాగా ఆలోచించి ఇద్దరు తమ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై విగత జీవులుగా కనిపించారు. ఈ విషయం తెలిసి కుటుంబసభ్యులు కన్నీళ్లు పెట్టుకుని విలవిలా ఏడ్చారు. అలా చూసేసరికి వారి బాధకు చుట్టు పక్కల ఉన్న వారందరి కళ్లూ చమర్చాయి.