Students Problems with Dilapidated School Buildings:పాఠశాలలను నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా సుందరంగా అభివృద్ధి చేసి తీర్చిదిద్దామని గొప్పలు చెప్పుకుంటున్న గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దశాబ్దాల క్రితం నిర్మించిన ఆ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరుకుని కూలిపపోయే స్థితిలో ఉన్నాయి. ఆరు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల భవనాల గోడలు నానిపోయి పెచ్చులూడి పడుతున్నాయి. దీంతో పాఠశాలను అత్యవసరంగా పంచాయతీ కార్యాలయంలోకి మార్చారు.
అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం వీరభద్రపేటలోని ప్రాథమికపాఠశాలను దశాబ్దాల క్రితం నిర్మించారు. ఇక్కడ దాదాపుగా 40 ఏళ్ల క్రితం పాఠశాల భవనాలను కట్టడంతో మూడు భవనాలు చాలా ఏళ్ల క్రితమే శిథిలావస్థకు చేరుకున్నాయి. తరగతి గదిలో పెచ్చులూడి పిల్లల తలపై పడుతున్నాయి. శిథిలమైన పాఠశాల భవనాలు ఏ క్షణంలో కూలిపోతాయని భయంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు బిక్కుబిక్కుమంటున్నారు.
Government School Problems : 'నాడు నేడు' నిధుల లోటు.. పాఠశాలల నూతన భవనాలు ఏడాది లేటు..! విద్యార్థుల అవస్థలు
"మా పాఠశాల భవనాలు శిథిలమై కూలిపోయే స్థితిలో ఉన్నాయి. అప్పుడప్పుడు తరగతి గదిలో పెచ్చులూడి మాపై పడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థకు చేరిన భవనాలు మరింత ప్రమాదకరంగా మారాయి. దీంతో పాఠశాలను విడిచి గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో తరగతులు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం స్పందించి మా పాఠశాలకు తరగతి గదులను నిర్మించాలని కోరుతున్నాం" - విద్యార్థులు, వీరభద్రపేట, ప్రాథమిక పాఠశాల
"ఇక్కడ పాఠశాల భవనాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. కూలిపోయే స్థితికి చేరుకున్నాయి వారం రోజులుగా వర్షాలు కురుస్తుండగా భవనాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో పాఠశాలను పంచాయతీ కార్యాలయానికి మార్చాం. ఇక్కడ కూడా అరకొర సదుపాయలతో ఇబ్బంది పడుతున్నాం. మరుగుదొడ్లు లేవు, తాగడానికి మంచినీటి సౌకర్యం లేదు. పాఠశాల భవనాల పరిస్థితిపై గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు. ఐదేళ్ల నుంచి భవనాల పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా పాఠశాల భవనాల సమస్య పరిష్కరించాలని కోరుతున్నాను." - చైతన్య, హెచ్ఎం, వీరభద్ర పేట
ఈ పాఠశాలలో 24 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పాఠశాల గోడలు నానిపోయాయి. దీంతో భవనాలు కూలిపోయే విద్యార్థులపై పడిపోతాయనే భయంతో ఉపాధ్యాయులు గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలోకి పాఠశాలను మార్చారు. అక్కడే విద్యార్థులకు బోధిస్తున్నారు. సరైన పాఠశాల భవనాలు లేక పంచాయతీ కార్యాలయంలో ఉన్న ఒక గదిలో అరకొర సదుపాయాలతో విద్యార్థులందరినీ ఒకే చోట కూర్చోబెట్టి బోధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఉపాధ్యాయులు వాపోతున్నారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో నాడు-నేడులో కొత్తగా భవనాలు మంజూరు చేయాలని ఎన్నో మార్లు అధికారులు, పాలకులు దృష్టికి తీసుకెళ్లినా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పాఠశాల భవనాలు లేక కొందరు విద్యార్థులు ప్రైవేట్ స్కూల్స్‌కు వెళ్లిపోతున్నారని అన్నారు. కొత్త ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి పాఠశాలకు భవనాలను మంజూరు చేసి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అసంపూర్తిగా గురుకుల భవనం - శిథిలావస్థకు చేరినా పట్టించుకోని ప్రభుత్వం