Internet Using For Students : 'చూడు.. ఒక వైపే చూడు.. రెండోవైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు’ సింహా సినిమాలో బాలకృష్ణ పంచ్ డైలాగ్ ఇది. అంతర్జాలం వాడే విషయంలోనూ ఇది వర్తిస్తుంది. మనకు ఏం కావాలో అదే చూడాలి. మన నైపుణ్యాలు పెంచుకోవాలి. ఏవిపడితే అవి చూస్తే జీవితాలే నాశనం అవుతాయి. నైపుణ్యాలు నేర్చుకోవడంలో అంతర్జాలాన్ని చక్కగా వాడుకుని ఎందరో ప్రయోజకులు అయ్యారు.
సామాజిక మాధ్యమాలలో మనం మంచి కోరుకుంటే మంచి, చెడు కోరుకుంటే చెడు ఉంటుంది. ఏం చేయాలన్నా మీరు చేసే దానిపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాలంలో మునిగి తేలుతూ, సామాజిక మాధ్యమాలతో గంటల కొద్దీ సమయం వృథా చేస్తున్న వారిని ఎంతో మందిని చూస్తున్నాం. విద్యార్థులు, యువకులు ఎక్కువగా వీటి ప్రభావానికిలోనై జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆర్థిక నష్టాలకు గురవుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. కొందరు మాత్రం అంతర్జాలాన్ని ఆయుధంగా వాడుకుని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు.
విజ్ఞానం పెంచుకోడానికి గూగుల్ : సామాజిక మాధ్యమాల్లో వచ్చేదంతా చెత్త కాదు. మంచి కంటెంట్ ఉంటుంది. విజ్ఞానం పెంచుకోడానికి గూగుల్‌ను వెతుకుతాం. లభించిన సమాచారం నిర్ధారించుకోవడానికి అంతర్జాలంలోనే అనేక పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపార రంగంలో కొత్త కొత్త అంశాలను తెలుసుకోవచ్చు. ఎక్కువ ఆలోచనలు, నిరాశ, ఉన్నవారు మోటివేషన్ ప్రసంగాలతో తమను తాము మార్చుకోవచ్చు. యూట్యూబ్‌లో మీకు వచ్చిన నైపుణ్యాన్ని పోస్ట్ చేసి లక్షల్లో డబ్బులు సంపాదించవచ్చు.