Student Dies Due to Poori Roll Stuck In Throat in Hyderabad :చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి.. కోడిగుడ్డు గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి.. ఇలా చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు వయసుతో సంబంధం లేకుండా ఆహారం గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోతున్నవారెందరో. ఇటువంటి ఘటనే హైదరాబాద్‌లోని బేగంపేటలో జరిగింది. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా పూరీలు గొంతులో ఇరుక్కొని విద్యార్థి మృతి చెందాడు.
ఇన్‌స్పెక్టర్ రామయ్య వివరాల ప్రకారం సికింద్రాబాద్ ఓల్డ్‌బోయిగూడకు చెందిన గౌతమ్ జైన్ కుమారుడు వీరేన్ జైన్(11) పరేడ్ గ్రౌండ్ సమీపంలోని అక్షర వాగ్ధేవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. సోమవారం మధ్యాహ్నం 12.20 గంటలకు విరామ సమయంలో భోజనం చేస్తూ తన లంచ్ బాక్స్‌లో చుట్టలాగా చుట్టుకుని తీసుకొచ్చిన మూడు పూరీలను నోట్లో పెట్టుకుని తినేందుకు ప్రయత్నించాడు. దీంతో పూరీల చుట్ట గొంతులో ఇరుక్కొంది. వీరేన్ జైన్ ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతూ కిందపడిపోయాడు.
చికెన్ ముక్క ప్రాణం తీసింది - క్షణాల్లో ఊహించని ఘోరం
అపస్మారక స్థితికి చేరడంతో పాఠశాల సిబ్బంది అతన్ని హుటాహుటిన మారేడుపల్లిలోని గీతా నర్సింగ్‌హోంకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడ నుంచి బాలుడ్ని సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం గొంతులో ఇరుక్కొన్న పూరీలను తొలగించారు. తండ్రి గౌతమ్ జైన్ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తింటున్నప్పుడు జాగ్రత్త :ఆహారం తినేటప్పుడు ఆదరాాాబాదరాగా తినకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు. సమయం తక్కువగా ఉందని మధ్యాహ్న భోజనం చేసేటప్పుడు గబా గబా తింటారని, అలా తినకూడదని వివరిస్తున్నారు. తినేటప్పుడు నిదానంగా నమిలి మింగాలని, మంచినీరు అందుబాటులో ఉంచుకోవడం మేలని డాక్టర్లు తెలుపుతున్నారు. ప్రస్తుత ఉరుకుల పరుకుల జీవితంలో సమయం లేదని అంతా ఆదరాబాదరగా తింటున్నారు. దీంతో పిల్లలకూ అదే అలవడుతుంది. ఆ అలవాటు వల్ల అనర్థాలు తలెత్తుతాయనీ, ఆరోగ్యానికీ అది మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.
బాలుడి గొంతులోకి 'చేప'- కండీషన్ సీరియస్! - Fish Struck In Boy Throat