Stella L Panama Ship Issue : కాకినాడ తీరంలో లంగరు వేసిన 'స్టెల్లా ఎల్ - పనామా నౌక కదలికపై తర్జన భర్జన కొనసాగుతోంది. నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాలను పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నేడు పరీక్షలు నిర్వహించనున్నారు. తాజా పరిణామాలపై శుక్రవారం ఎగుమతిదారులు కాకినాడలో అంతర్గత సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు.
కాకినాడ ఎంకరేజ్ పోర్టులో రేషన్ బియ్యం ఆనవాళ్లను కలెక్టర్ గుర్తించడం, నౌకను సీజ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించడం, తదనంతర పరిణామాలతో నెలకొన్న ప్రతిష్ఠంభన వీడే అవకాసం కనిపిస్తోంది. నౌకలో సేకరించిన 12 కంపెనీలకు చెందిన బియ్యం నమూనాలు కాకినాడలోని పౌర సరఫరాల శాఖ జిల్లా ప్రయోగశాలలో ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. సాయంత్రానికి ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఫలితాల నివేదికను కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ప్రభుత్వానికి పంపిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. నిల్వలు సీజ్ చేసి నౌకను పంపే అవకాశం కనిపిస్తోందన్న వాదన వినిస్తోంది.
వారం గడచినా పరీక్షలు లేవు - స్టెల్లా ఎల్ షిప్పై ఎందుకీ ప్రతిష్టంభన?
భారీగా నష్టం: నౌకలోకి ఎక్కించిన నిల్వలు దింపడం సాధ్యం కాదనే వాదన ఎగుమతిదారుల నుంచి వినిపిస్తోంది. ప్రభుత్వం అక్రమ నిల్వలు స్వాధీనం చేసుకున్న ప్రతిసారీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి బ్యాంకు గ్యారెంటీలతోనో, ప్రత్యేక అనుమతులతోనో విడిపించుకునే ఎగుమతిదారులు ఈసారీ అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు ఎగుమతిదారులు, కంపెనీలు శుక్రవారం కాకినాడలో అంతర్గత సమావేశం నిర్వహించి తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు.