Lokesh Meeting with Teacher Associations: 'ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్' కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఉపాధ్యాయుల సహకారంతోనే అది సాధ్యమవుతుందని విద్యాశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయాలని స్పష్టం చేశారు. సంస్కరణల అమలులో పొరపాట్లు జరిగితే సంబంధిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి వెనకాడమన్నారు. ఫలితాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లతో పోటీపడాలని సూచించారు.
ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి: ప్రభుత్వ పాఠశాలల్లో ఫలితాల సాధనే లక్ష్యంగా సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించామని, ఇప్పుడు అమలు చేయకపోతే రాబోయే పదేళ్లల్లో ప్రభుత్వ విద్యా వ్యవస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. జీఓ-117 రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, వంద రోజుల ప్రణాళిక, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంత్రి ఉండవల్లి నివాసంలో నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. సంస్కరణల అమలులో కొన్ని పొరపాట్లు జరిగితే సంబంధిత నిర్ణయాలను వెనక్కి తీసుకోవడానికి తాము వెనకాడమని మంత్రి స్పష్టం చేశారు.
విద్యావ్యవస్థ బలోపేతమే లక్ష్యం: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోందని, డ్రాపవుట్స్ పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. 300 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయని ప్రభుత్వ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపాధ్యాయుల సహకారం అవసరమని స్పష్టం చేశారు. సర్కారు విద్యలో ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకొని సరిదిద్దుతామన్నారు. చిన్న పిల్లలు నాలుగైదు కిలోమీటర్ల నుంచి బడులకు రావడం కష్టమవుతున్నందునే జీఓ-117ను రద్దు చేసి, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించామని చెప్పారు. ఉపాధ్యాయులపై అనవసరమైన యాప్ ల భారం తగ్గించామని, ఇంకా అమలులో ఉన్న నాన్ అకడమికమ్ యాప్ ల బాధ్యతను తొలగించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు.
11ఏళ్లకే 19 పతకాలు - కరాటేలో సత్తా చాటుతున్న తణుకు చిన్నారి - TANUKU KARATE GIRL
ప్రతి నాలుగు గ్రామాలకు ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు: కూటమి ప్రభుత్వంలో ఒక్క ప్రభుత్వ స్కూలు కూడా మూతపడకూడదు. ఒక్క టీచర్ సైతం తగ్గకూడదని మంత్రి లోకేశ్ ఆదేశించారని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఫలితాల సాధన, హాజరుశాతం పెంపుదలకు ఉపాధ్యాయులు కృషిచేయాలని స్పష్టం చేశారు. ప్రవేశాలు పెంచేందుకు గ్రామాల పరిధిలోని బడిఈడు పిల్లల సమాచారంతో రిజిస్టర్ నిర్వహిస్తే బాగుంటుందని, గతంలో ప్రధానోపాధ్యాయులు చేసేవారని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందించామని, ఏప్రిల్, మే నెలల్లో బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తామని డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు. తరగతికి ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి నాలుగైదు గ్రామాలకు ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. మెరుగైన ఫలితాల కోసం వందరోజుల పాఠ్యప్రణాళికను పకడ్బందీగా అమలుచేయాలని స్పష్టం చేశారు.
పదోన్నతులు కల్పించాలన్న ఉపాధ్యాయ సంఘాలు: సెకండరీ గ్రేడ్ టీచర్లు 20ఏళ్లు పని చేసినా స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయుల పదోన్నతితోనే ఆగిపోతున్నారని, లెక్చరర్లు, డిప్యూటీ ఈవో స్థాయి వరకు పదోన్నతులు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు విన్నవించారు. నాలుగైదు గ్రామాలను కలిపి ఏర్పాటు చేసే మోడల్ స్కూలుకు రవాణా సౌకర్యం కల్పించాలని, ప్రాథమిక బడుల్లో తెలుగు మాధ్యమం అమలు చేయాలని విన్నవించారు. గ్రామీణ బడులకు పీఈటీలను నియమించాలని, అంతర జిల్లా బదిలీలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, అశోక్‌బాబు, వేపాడ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
సీబీఎస్ఈ రగడ - ఎక్స్ వేదికగా నారా లోకేశ్ Vs వైఎస్ జగన్ - Nara Lokesh Counter to YS Jagan