Statewide Pre -Sankranti Celebration in Andhra Pradesh :చిన్నారులు, యువత ఆటపాటలు పండు వెన్నెలను పోలిన వెండి ముగ్గులు మధ్యలో గొబ్బెమ్మలు గంగిరెద్దుల విన్యాసాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ముందస్తు వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువజనులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పోటీల్లో పాల్గొంటూ పతంగులు ఎగురవేస్తూ సంక్రాతి శోభతో అలరిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని డాక్టర్ లక్కిరెడ్డి అనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలకు విశేష స్పందన లభించింది. రంగువల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, బొమ్మల కొలువులతో గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో సంక్రాంతి పండుగను విద్యార్థులు నిర్వహించారు. భావితరాలకు పండుగ సాంప్రదాయాలను అందించడమే లక్ష్యంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు విజ్ఞాన్స్ విద్యా సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య తెలిపారు.
ఏఆర్ పోలీసు గ్రౌండ్‌లో సంక్రాంతి సంబరాలను విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు ప్రారంభించారు. మహిళా పోలీసు సిబ్బంది వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డలో గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల బల ప్రదర్శన పోటీల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి పశుపోషకులు పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కలగంపూడిలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంస్కృతి, సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేశారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భోగిమంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు అందరిని అలరించాయి. ముగ్గుల పోటీల్లో విజేతలుగా గెలిచినవారికి గృహోపకరణాలు బహుమతులుగా అందించారు.