State Wide Bhogi Celebrations : సంక్రాంతి శోభతో తెలుగు లోగిళ్లు వెలుగులీనుతున్నాయి. భోగభాగ్యాల సంక్రాంతిని ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. పట్టణం నుంచి పల్లెకు చేరిన వారంతా వేకువజామునే లేచి భోగి మంటలు వేశారు. ఆటపాటలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి సందడి కనిపిస్తోంది.
CM Chandrababu Wishes To People :సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలందరికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి మంటలతో సమస్యలన్నీ పోయి ప్రజలందరికీ భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. మంత్రి లోకేశ్ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ భోగి మంటలు జీవితాల్లో సరికొత్త కాంతులు తీసుకురావాలి తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెంలో స్థానిక కూటమి నాయకుడు ద్వారంపూడి వెంకట రెడ్డి ఆధ్వర్యంలో భారీ భోగిమంట ఏర్పాటు చేశారు. 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల చుట్టూ విస్తీర్ణతతో భోగి మంట కోసం భారీగా దుంగలు ఏర్పాటు చేశారు. అనపర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి భోగిమంట వెలిగించి వేడుకలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ప్రజలు ఆనందోత్సవాలతో పండుగను జరుపుకుంటున్నారని ఎమ్మెల్యే అన్నారు
నెల్లూరు జిల్లాలో భోగి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. నగరంలో ప్రజలు వేకువజామునే భోగి మంటల వేశారు. నెల్లూరులో పలు డివిజన్లలో భోగి వేడుకల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. మూలాపేట మూలస్థానేశ్వర ఆలయం వద్ద కేకు కట్ చేసి భోగి మంటలు వెలిగించారు. ట్రంకురోడ్డు శివాజీ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి సంబరంగా మంటలు వేశారు. కార్యకర్తలతో కలిసి పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు.