Solar Power Plant Scheme : పలు ప్రైవేటు సంస్థలు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల సౌర కంచెలను ఏర్పాటు చేశాయి. మైరాడ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల నెల్లికుదురు, తొర్రూరు, నెక్కొండలో 11 సోలార్ పవర్ మోటార్లు, 22 సోలార్ విద్యుత్ కంచెలను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సమాయత్తమవుతోంది. ఇంట్లో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సరైన ప్రచారం లేకపోవడం వల్ల అవి ప్రజలకు చేరడం లేదు. తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన సంస్థ (టీజీ రెడ్కో) ఆధ్వర్యంలో విస్తృతంగా వీటిపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది.
నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో :హైదరాబాద్ తర్వాత అత్యధిక గృహవసర సౌర ప్యానెళ్లు ఉమ్మడి వరంగల్‌లోనే ఉన్నాయి. ప్రస్తుతం 20 వేల వరకు సోలార్ గృహ ప్లాంట్లు ఉన్నట్లుగా అంచనా. అవి ఈ ఏడాది చివరినాటికి లక్ష వరకు దాటే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
మూడు కిలోవాట్లు లేదా అంతకన్నా ఎక్కువ సోలార్ ప్యానెళ్లను గృహవసరాలకు ఏర్పాటు చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ‘ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ కింద రాయితీలు వర్తిస్తున్నాయి. ఒక కిలోవాట్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే రూ.84 వేలు ఖర్చవుతుండగా ఇందులో రూ.30 వేలు పథకం కింద రాయితీ వస్తోంది. మూడు కిలోవాట్ల ప్యానెల్‌కు రూ.2.06 లక్షలు ఖర్చవుతుండగా ఇందులో రూ.78 వేలు ప్రభుత్వం రాయితీ ఇస్తోంది.
పీఎం కుసుమ్’స్కీమ్ కింద తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసేటువంటి 4 వేల మెగావాట్ల సోలార్ ప్యానెళ్లలో 1000 మెగావాట్లను మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలను(ఎస్‌హెచ్‌జీలు) ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఒక మెగావాట్ సామర్థ్యానికి ఐదు ఎకరాల స్థలం కావాల్సి ఉండగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ స్థలాలు ఎక్కడెక్కడున్నాయో అధికారులు లెక్కలు తీస్తున్నారు. ప్రభుత్వ స్థలం దొరకగానే 25 ఏళ్లకు ఎంపిక చేసిన స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ)లకు కేటాయిస్తారు. ఇందుకు 4 కోట్ల రూపాయల వరకు ఖర్చు కానుంది. 10 శాతం స్వయం సహాయక సంఘాలు చెల్లిస్తే మిగతా మొత్తాన్ని బ్యాంకుల ద్వారా లోన్‌గా ఇస్తారు. 15 ఏళ్లలో ప్లాంట్ నిర్మాణ ఖర్చులు తిరిగి రానుండగా మరో 10 ఏళ్ల పాటు విద్యుదుత్పత్తితో ఎస్‌హెచ్‌జీలకు ఆదాయం సమకూరనుంది.