Srisailam Project Victims Waiting for Jobs :శ్రీశైలం ప్రాజెక్టు కోసం చాలా మంది రైతులు భూములు త్యాగాలు చేశారు. ఇళ్లు కోల్పోయారు. ఊళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. సర్వం కోల్పోయారు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని అప్పటి టీడీపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొంత మేర హామీని అమలు చేసినా పూర్తిస్థాయిలో మాత్రం ఇప్పటికీ నెరవేరలేదు. గత వైఎస్సార్సీపీ సర్కార్ ఇదిగో, అదిగో అని ఊరించి ఉసూరుమనిపించింది. ఉద్యోగాల కోసం తరతరాలు ఎదురుచూస్తున్న వారంతా కూటమి ప్రభుత్వంపైనే కొండంత ఆశ పెట్టుకున్నారు.
సర్వం త్యాగం చేశాం :శ్రీశైలం ప్రాజెక్టు వేలాది గ్రామాలకు తాగునీరు, లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోంది. రాయలసీమ సహా నెల్లూరు, చెన్నై వరకు ఎంతో మంది ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ప్రాజెక్టు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, పాములపాడు, జూపాడు బంగ్లా, పగిడ్యాల, కొత్తపల్లి మండలాల పరిధిలోని 3 వేల మందికిపైగా రైతులు సుమారు 10 వేల ఎకరాలు త్యాగం చేశారు. వీరందరికీ జీవో నెంబర్ 98 ప్రకారం ఉద్యోగాలు ఇస్తామని 1986లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుమారు 40 ఏళ్లు కావొస్తున్న ఇప్పటివరకు హామీ పూర్తిగా అమలు కాలేదు.
అధికారుల తప్పిదాలు - పోలవరం నిర్వాసితుల జీవితాల్లో తొలగని కష్టాలు - POLAVARAM COMPENSATION problems
ఊరించి ఊసురుమనిపించిన వైఎస్సార్సీపీ :ఉద్యోగాల కోసం అప్పట్లో 44 గ్రామాలకు చెందిన 2 వేల మంది నిర్వాసిత రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 2011- 12 మధ్యలో వీరిలో 962 మందికి ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన లస్కర్లుగా ఉద్యోగాలు కల్పించారు. వీరికి మొదట్లో 8 వేలు, ప్రస్తుతం 20 వేల రూపాయల వేతనం అందిస్తున్నారు. రెండో విడతలో 930 మంది రైతులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కొంతమంది మరణించగా ప్రభుత్వం 674 మందిని అర్హులుగా గుర్తించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముంపు బాధితుల జాబితాని సిద్ధం చేసినా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎన్ని ఆందోళనలు చేసినా పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత పాలకుల నిర్లక్ష్యం - పోలవరం నిర్వాసితుల పాలిట శాపం - Polavaram Residents Problems
కూటమి ప్రభుత్వంపైనే కోటి ఆశలు :ఎన్నికల ముందు నందికొట్కూరులో ముంపు బాధితులు వంద రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. ఆ సమయంలో యువగళం పాదయాత్రలో భాగంగా నందికొట్కూరుకి వచ్చిన లోకేశ్ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది ఆరంభంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా నందికొట్కూరుకు వచ్చిన చంద్రబాబు సైతం ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండటంతో తమ ఉద్యోగాల కల నెరవేరుతుందని బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కర్నూలు జలవనరుల శాఖలో చాలామంది పదవీ విరమణ పొందారు. మరికొన్ని ఖాళీలు ఉన్నాయి. వీటి భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో తమకి అవకాశం కల్పించాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
"పోలవరం కోసం సర్వం త్యాగం చేశాం- 20 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురుచూస్తున్నాం" - Polavaram Residents Problems