Finger Chopping Protest in Delhi :మాజీ హోంమంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనుయాయుల అరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఆమె ఈ విధంగా చేశారు. ఈ ఘటన ఆదివారం దిల్లీలో జరిగింది. దీనికి సంబంధించి బాధితురాలి కథనం ఇలా ఉంది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ అధికార పార్టీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనుయాయులు కొందరు గుంటూరు నగర శివారు స్వర్ణభారతినగర్, అడవితక్కెళ్లపాడు పరిధిలో భూదందాలకు పాల్పడ్డారు. పేదల భూములకు నకిలీ హక్కు పత్రాలు సృష్టించి విక్రయిస్తూ అసలైన హక్కుదారులను రోడ్డున పడేశారు. వారి అన్యాయాలను స్థానికంగా ఉన్న ఆదర్శ మహిళా మండలి సభ్యులు ప్రశ్నించి కలెక్టర్, ఎస్పీ, డీజీపీ, సీఐడీ విభాగాలకు ఫిర్యాదు చేశారు. వాటిపై వారు స్పందించకపోగా తిరిగి శ్రీలక్ష్మిపైనే కేసులు పెట్టారు. దీంతో ఆమె కొందరు మహిళలతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడానికి దిల్లీ వెళ్లారు. ఆయా కార్యాలయాలకు వెళ్లి ఆమె వినతిపత్రాలు అందజేశారు. అలాగే ఈ వ్యవహారం దేశం దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకుని శ్రీలక్ష్మి తన ఎడమ చేతి బొటన వేలును నరుక్కున్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్ ముందు సెల్ఫీ వీడియో తీసుకుని నియోజకవర్గంలో చోటు చేసుకున్న భూకబ్జాలు, దందాలు, గంజాయికి బానిసలవుతున్న యువత పరిస్థితిని తెలియజేశారు.
సొంత బాబాయ్‌నే చంపిన వారు- వేలు కోసుకుంటే స్పందిస్తారా: లోకేశ్ - Lokesh Reaction on Kovuru Lakshmi
ఫోర్జరీ చేసి అక్రమాలు :స్వర్ణ భారతినగర్, అడవితక్కెళ్లపాడులో పేద ప్రజలు ఎక్కువగా నివాసం ఉంటారు. గతంలో ఇక్కడ పలు సందర్భాల్లో పేదలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది. స్థలాలు పొందిన వారిలో కొందరు అక్కడ ఉండడం లేదు. ఇలాంటి వారి స్థలాలను కబ్జా చేసి నకిలీ హక్కు పత్రాలతో విక్రయిస్తున్నారని, ఈ అన్యాయాలపై ప్రశ్నిస్తే తనను సుచరిత అనుయాయులు లక్ష్యంగా చేసుకున్నారని, అధికారం వినియోగించి తనపైనే పోలీసులకు లేనిపోనివి చెప్పి ఎదురుకేసులు పెట్టించారని శ్రీలక్ష్మి తెలిపారు. వీరి అక్రమాలకు కొందరు రెవెన్యూ అధికారుల సహకారం ఉందని చెప్పారు. అందుకే దేశం దృష్టికి సుచరిత అనుయాయుల అరాచకాలను తీసుకెళ్లాలని భావించి దిల్లీ వెళ్లి ఆదివారం బొటన వేలిని నరుక్కున్నట్లు తెలిపారు.