Srikalahasti Woman Requesting Govt to Bring her Back From Kuwait:బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వయస్సులో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని ఆశపడి అందరిని వదిలి పరాయి దేశానికి వెళ్లింది ఓ మహిళ. పొట్టకూటి కోసం అక్కడికి వెళితే కడుపు నిండా తిండి లేదు, కంటినిండా కునుకు ఉంటట్లేదు. దీనివల్ల ఆరోగ్యం బాగా పాడయింది. అయినా కనికరించని యజమానులు ఆమెను గదిలో బంధించి నరకం చూపించారు. చివరి ప్రయత్నంగా తన బాధను సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమె తిరుపతి జిల్లాకు చెందిన మహిళ.
నిత్యం వేధింపులకు గురి: జీవనాధారం కోసం కువైట్‌కి వస్తే ఇక్కడ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్‌కి చెందిన ఓ మహిళ వీడియో సందేశం పంపడంతో ఆమె కుటుంబ సభ్యలు ఆందోళనకు గురవుతున్నారు. ఆరోగ్యం సరిగ్గా లేనప్పటికీ నిత్యం వేధింపులకు గురి చేస్తూ గదిలో ఉంచి తీవ్రంగా కొడుతున్నారని లక్ష్మి దుఃఖంతో విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంది.