Sri Priyanka Enterprises Fraud in Hyderabad :కృష్ణా జిల్లాకు చెందిన మేకా నేతాజీ హైదరబాద్ అబిడ్స్‌లోని అతని కుమారుడు శ్రీహర్షతో కలిసి ప్రింటింగ్ సంబంధించిన వస్తువులు సరఫరా చేసే వ్యాపారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్, గ్రాఫిక్ సిస్టమ్స్ అనే రెండు సంస్థలను ప్రారంభించారు. హైదారాబాద్, విజయవాడ, బెంగళూరులో బ్రాంచులను ఏర్పాటు చేశారు. అయితే వ్యాపార అవసరాల కోసం పలువురి నుంచి తమ కంపెనీలో పెట్టుబడులు ఆశించి, 15 నుంచి 18 శాతం వడ్డీ ఇస్తామని నమ్మబలికారు.
అధిక వడ్డీ అనడంతో ఆశపడి రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 537 మంది నుంచి దాదాపు 200 కోట్లు వసూలు చేశారు. జనవరి వరకి వడ్డీ ఇచ్చిన నేతాజీ అప్పటి నుంచి ఇవ్వడం నిలిపివేశాడు. అప్పటి నుంచి అడుగుతుంటే ఇస్తా ఇస్తా అంటూ నమ్మబలికాడు. రోజులు గడుస్తున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన పెట్టుబడుదారులు భవిష్యత్ కోసం దాచుకున్న సొమ్మంతా కంపెనీలో పెట్టామని న్యాయం చేయాలంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.
వడ్డీ ద్వారానే జీవితం గడుస్తుందని ఆశతో :మేకా నేతాజి భార్య నిమ్మగడ్డ వాణీబాల అబిడ్స్‌లోని తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సహా పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మేకా నేతాజి సంస్థలో పెట్టుబడులు పెట్టేలా ఆమె ప్రోత్సహించినట్టు బాధితులు తెలిపారు. బ్యాంకులో వడ్డీ ఎక్కువగా రాదని, తన భర్త కంపెనీలో 18 శాతం వరకూ వడ్డీ పొందవచ్చని చెప్పి అందరితో పెట్టుబడి పెట్టించినట్లు బాధితులు వాపోతున్నారు. టెస్కాబ్‌లో ఫించన్ లేదని, వడ్డీ ద్వారానే జీవితం గడుస్తుందని ఆశతో వాణీబాల మాటలు నమ్మి సంపాదించుకున్న మొత్తాన్ని ఫైనాన్స్ కంపెనీలో పెట్డి మోసపోయామని సంస్థలోని పలువురు విశ్రాంత అధికారులు వాపోయారు.