Health Benefits Of Spirulina : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలోనే చాలా మంది నేటి రోజుల్లో డ్రై ఫ్రూట్స్, పండ్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకుంటుంటారు. కానీ, వాటన్నింటిని భర్తీ చేసే "స్పైరులినా పొడిని" రోజూ ఒక టీస్పూన్ తీసుకున్నారంటే చాలు. మీ అంత ఆరోగ్యంగా ఎవరు ఉండరని సూచిస్తున్నారు నిపుణులు! ఇంతకీ, స్పైరులినా పొడిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటి? దాన్ని ఎలా తీసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
స్పైరులినా అనేది నాచు జాతికి చెందిన ఒక నీటి మొక్క. ముదురాకుపచ్చటి రంగులో ఉండే స్పైరులినా పొడిగా, బిళ్లలుగా, పాస్తాలాగా, పిల్లర్స్‌లా.. వివిధ రూపాల్లో లభ్యమవుతుంది. ఫైకోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ స్పైరులినాకు ముదురాకుపచ్చ రంగును ఇస్తుంది. దీనిలో విటమిన్లు, కెరోటినాయిడ్స్, ఫైటో న్యూట్రియెంట్లు, కాపర్, ఐరన్, మెగ్నిషియం, క్రోమియంతో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి దీన్ని 'పోషకాల గని'గా చెప్పుకోవచ్చంటున్నారు నిపుణులు. ఫలితంగా డైలీ ఒక టీ స్పూన్ స్పైరులినా పొడి తీసుకుంటే బోలెడు హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు.
మధుమేహులకు బెస్ట్ మెడిసిన్ : స్పైరులినా మధుమేహులకు దివ్యౌషధంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందులోని పోషకాలు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్(National Library of Medicine రిపోర్టు) లెవల్స్‌ని తగ్గించడంలో, HbA1c స్థాయిలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతాయని చెబుతున్నారు. 2021లో 'జర్నల్ ఆఫ్ డయాబెటిస్ ఎండ్ మెటబాలిక్ డిజార్డర్స్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. స్పైరులినా పొడిని రోజూ కొద్దిగా తీసుకోవడం ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ను కంట్రోల్లో ఉంచడానికి చాలా బాగా సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని Guilan University of Medical Sciencesకు చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ Makan Pourmasoumi పాల్గొన్నారు.
గుండె ఆరోగ్యానికి మేలు :స్పైరులినాలోని ప్రొటీన్, ఇతర పోషకాలు బాడీలోని చెడుకొలెస్ట్రాల్(Cholesterol)స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఇందులోని ప్రొటీన్ ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా జీవక్రియను మెరుగుపరచడానికి స్పైరులినా చాలా బాగా తోడ్పడుతుందంటున్నారు.
రక్తపోటును తగ్గిస్తుంది :స్పైరులినా రక్తపోటును కంట్రోల్లో ఉంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి హైబీపీతో బాధపడేవారు రోజూ ఒక టీస్పూన్ స్పైరులినా పొడి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందంటున్నారు.
మంచి ఇమ్యూనిటీ బూస్టర్ :స్పైరులినాలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులోని మినరల్స్ బాడీలోని హెవీ మెటల్స్(భార లోహాలను) బయటకు పంపించడంలో చాలా బాగా దోహదపడతాయి. ఈ మెటల్స్ రోగ నిరోధక కణాలను దెబ్బతీస్తాయి. అదే.. స్పైరులినా పొడి తీసుకుంటే ఆ సమస్య తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.
ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ :క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను అడ్డుకోవడంలో స్పైరులినాలోని యాంటీ ఆక్సిడెంట్లు చాలా బాగా పనిచేస్తాయంటున్నారు. అలాగే స్పైరులినాలో ప్రోబయోటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చెబుతున్నారు.