ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుకాసురులు - ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డగోలుగా తవ్వకాలు - sand exploitation in YCP rule - SAND EXPLOITATION IN YCP RULE

Sand Mining Illegally Under YCP Rule: వైసీపీ నేతల ఇసుక దోపిడీకి అడ్డేలేకుండా పోతోంది. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య’నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక దోపిడీ కొనసాగుతోంది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీ, హైకోర్టు పలు మార్లు నోటీసులు జారీ చేసినా ఏమాత్రం పట్టించుకోకుండా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు ప్రభుత్వానికి వంతపాడటంతో సహజవనరుల దోపిడీ కొనసాగుతోంది.

Sand Mining Illegally Under YCP Rule
Sand Mining Illegally Under YCP Rule

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 7:16 AM IST

ఐదేళ్ల వైసీపీ పాలనలో ఇసుకాసురుల చరిత్ర
Sand Mining Illegally Under YCP Rule: గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను అధికారపార్టీ నేతలు పూర్తిగా బేఖాతరు చేస్తున్నారు. వివిధ ఉల్లంఘనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్, హైకోర్టు మొట్టికాయలు వేసి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, వాటిని పట్టించుకోవడం లేదు. కోర్టుల పని కోర్టులదే, మా దందా మాదే అనేలా వ్యవహరిస్తున్నారు. అధికారులూ కోర్టు ఆదేశాల ప్రకారం వీరి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నమే చేయడంలేదు. దీంతో వైసీపీ నేతల దోపిడీకి అడ్డేలేకుండా పోతోంది. ఇసుక తవ్వకాల విషయంలో ఎన్‌జీటీ, హైకోర్టు పలు సందర్భాల్లో కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ తీరుని తీవ్రస్థాయిలో ఎండగట్టింది. అయినాసరే ‘ముఖ్య’నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక దోపిడీ ఆగలేదు.

ఎన్ని కేసులు వేసినా: రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో రెండు కేసులు, హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇందులో పల్నాడు జిల్లా అమరావతి మండలానికి చెందిన దండా నాగేంద్రకుమార్, తిరుపతి జిల్లాలోని అరణియార్‌ నదిలో ఇసుక తవ్వకాలపై అదే జిల్లాకు చెందిన హేమకుమార్‌ ఎన్‌జీటీలో వేసిన కేసులు కీలకమైనవి. రెండు కేసుల్లోనూ గనులశాఖ చివరి వరకు వాస్తవాలు దాచేస్తూ, అధికారపార్టీ ‘ముఖ్య’నేత సోదరుడి ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలకు సహకారం అందించింది. ఇసుక గుత్తేదారుగా ఉన్న జయ్‌ప్రకాశ్‌ పవర్‌ వెంచర్స్‌ రాష్ట్రమంతటా ఉల్లంఘనలకు పాల్పడుతోందంటూ దండా నాగేంద్రకుమార్‌ 2022లో ఎన్‌జీటీని ఆశ్రయించారు. సెమీ మెకనైజ్డ్‌ పేరిట అనుమతిస్తే, పెద్దయంత్రాలతో నదుల్లో భారీ గుంతలు ఏర్పడేలా తవ్వేస్తున్నారంటూ ఎన్‌జీటీ దృష్టికి తీసుకొచ్చారు.

తవ్వకాలు ఆపేయాలని ఆదేశాలిచ్చినా: ఫిర్యాదులపై స్పందించిన ఎన్‌జీటీ, సెమీ మెకనైజ్డ్‌ పేరిట జారీచేసిన పర్యావరణ అనుమతులు పునపరిశీలన చేయాలని, కొత్తగా మళ్లీ అనుమతులు ఇవ్వాలని, అప్పటివరకు తవ్వకాలు ఆపేయాలని గత ఏడాది మార్చి 23న స్పష్టంగా ఆదేశించింది. అప్పటికే జేపీ సంస్థకు రాష్ట్రంలో 110 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు ఈసీలు ఉన్నాయి. దీంతో వాటిలో తక్షణం తవ్వకాలు అపేయాలని, ఈసీలకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ రాష్ట్రస్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ గత ఏడాది ఏప్రిల్‌ 23న జేపీ సంస్థతోపాటు, గనులశాఖకు నోటీసులు ఇచ్చింది. అయితే ఇసుక గుత్తేదారు ఈ నోటీసులను ఏమాత్రం పట్టించుకోకుండా తవ్వకాలు కొనసాగించారు.

తూతూ మంత్రంగా తనిఖీలు: గనులశాఖ మాత్రం రాష్ట్రంలో ఎక్కడా ఇసుక తవ్వకాలు లేవంటూ ఎన్‌జీటీకి పచ్చి అబద్ధాలు చెబుతూ వచ్చింది. అయితే జిల్లా కలెక్టర్లు, రీచ్‌ల్లో పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ ఎన్‌జీటీ ఆదేశిస్తే, కలెక్టర్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో రీచ్‌ల్లో తనిఖీలు చేశారు. ఎక్కడా తవ్వకాలు లేవంటూ మూకుమ్మడిగా ఒకేలా నివేదిక ఇచ్చారు. ఇదే సమయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ మాత్రం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రీచ్‌ల్లో తనిఖీలుచేసి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ అసలు నిజాన్ని ఎన్‌జీటీ ముందు ఉంచింది. నిర్ఘాంతపోయిన ట్రైబ్యునల్‌.. మిగిలిన జిల్లాల్లో కూడా ఎమ్ఓఈఎఫ్ కమిటీయే తనిఖీలు చేసి, నివేదికను సుప్రీంకోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. ఇసుక గుత్తేదారుకు శిక్ష తప్పదని నిర్ధారించింది. చిత్రం ఏమంటే ఇంత జరిగినాసరే అధికారపార్టీ నేతలు ఇసుక తవ్వకాలు ఆపలేదు.

18 రీచ్​ల్లో తవ్వకాలు ఆపేయాలని ఆదేశం: తమిళనాడుకి సరిహద్దులో అరణియార్‌ నదిలో 11 కిలోమీటర్ల మేర, కరణి, సూరుత్తపల్లి, ఎస్‌ఎస్‌బీ పేట, బీకే బేడు, నాగలాపురం గ్రామాల పరిధిలో 18 ఇసుక రీచ్‌ల్లో భారీ యంత్రాలతో అక్రమ ఇసుక తవ్వకాలుచేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని హేమకుమార్‌ ఎన్‌జీటీని ఆశ్రయించారు. జాయింట్‌ కమిటీ ద్వారా పరిశీలన జరిపించిన తర్వాత 18 రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు ఆపేయాలని, వీటికి కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని, ఒక్కో రీచ్‌కి కోటి చొప్పున మొత్తం 18 కోట్లు జరిమానాను పర్యావరణ పరిహారంగా చెల్లించాలని ఎన్‌జీటీ తీర్పుచెప్పింది. అయితే దీనిపై ఇసుక గుత్తేదారైన జేపీ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించగా 18 కోట్ల జరిమానాపై మాత్రమే స్టే విధించింది. ఆయా రీచ్‌ల్లో తవ్వకాల కోసం ఎన్‌జీటీ చెప్పినట్లు కొత్తగా అనుమతులు తీసుకోవాలని ఆదేశించింది. కొత్త ఈసీలు మంజూరు కాకపోయినా అరణియార్‌ నదిలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు ఆగలేదు.

350 ఎకరాల ప్రభుత్వ భూమిలోనూ తవ్వకాలు: తిరుపతి జిల్లా చిల్లకూరు, కోట మండలాల్లోని మోమిడి, బల్లవోలు, వేళ్లపాలెం, మన్నెగుంట, సిద్ధవరం, కొత్తపట్నం, తమ్మినపట్నం గ్రామాల పరిధిలోని దాదాపు 350 ఎకరాల మేర ప్రభుత్వ భూముల్లో పెద్దఎత్తున సిలికా శాండ్‌ తవ్వకాలు సాగాయి. కొందరు లీజుదారులు తమ లీజుకు ఆనుకొని ఉన్న ఈ భూముల్లో ఇసుక తవ్వేశారు. అలాగే చెన్నై మైనింగ్‌ వ్యాపారికి చెందిన వామన ఎంటర్‌ప్రైజెస్, వామన ఫ్యూచర్‌ జెన్, ఫీచర్స్, గామా ఎంటర్‌ప్రైజెస్, వేంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పేరిట మినరల్‌ డీలర్‌ లైసెన్సులు తీసుకోగా.. ప్రభుత్వ భూముల్లో తవ్విన సిలికా శాండ్‌ అంతా అవే కొనుగోలుచేసి విక్రయించాయి. వీటిపై గ్రీన్‌ సొసైటీ ఆఫ్‌ కోస్టల్‌ కారిడార్‌ అనే సంస్థ ఎన్‌జీటీని ఆశ్రయించింది. దీనిపై నివేదిక ఇవ్వాలని ఎన్‌జీటీ గనులశాఖను ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు గనులశాఖ నివేదిక ఇవ్వకుండా వేర్వేరు కారణాలు చెబుతూ దాటవేత ధోరణి అవలంభిస్తోంది.

అవినీతి, అక్రమాల్లో ఆ వైఎస్సార్సీపీ నేత "రాజా ది గ్రేట్‌"! - YSRCP Leader family Irregularities

కాటన్​ బ్యారేజీకి పొంచి ఉన్న ముప్పు :గోదావరిలోనూ పడవ ర్యాంపుల ముసుగులో డ్రెడ్జింగ్‌ చేస్తూ, కాటన్‌ బ్యారేజీకి ముప్పు తెస్తోంది ఇసుక మాఫియా. బ్యారేజీలు, వంతెనలకు 300 మీటర్ల సమీపంలో ఇసుక తవ్వకాలు చేయకూడదని, డ్రెడ్జింగ్‌ నిర్వహించకూడదని నిబంధనలు ఉన్నాయి. కానీ పడవల్లో డ్రెడ్జింగ్‌ యంత్రాలతో బ్యారేజీకి దగ్గర వరకూ వెళ్లి ఇసుక తోడేస్తున్నారు. జాతీయ రహదారి-16తో అనుసంధానమైన గామన్‌ వంతెనకు ఆనుకొని కూడా డ్రెడ్జింగ్‌ ద్వారా ఇసుక తీస్తున్నారు. ఇలా ఇష్టానుసారం డ్రెడ్జింగ్‌ జరపడంపై రాజమహేంద్రవరానికి చెందిన జి.వంశీ దినేష్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే తవ్వకాలు ఆపేయాలంటూ ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం గత ఏడాది నవంబరులో ఆదేశించింది. అయినాసరే ఇసుక మాఫియా దర్జాగా రాత్రివేళ డ్రెడ్జింగ్‌ కొనసాగించింది. ఈ విషయాన్ని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకురావడంతో, దీనిపై నివేదిక ఇవ్వాలని తూర్పుగోదావరి ఎస్పీని కోర్టు ఆదేశించింది. అయితే ఎస్పీ బృందం జనవరి 16, 24 తేదీల్లో కొన్ని చోట్ల పరిశీలించి అక్రమ తవ్వకాలు లేవంటూ నివేదిక ఇచ్చింది.

అనకాపల్లి జిల్లా నాతవరం మండలం బమిడికలొద్ది వద్ద 121 హెక్టార్లలో లేటరైట్‌ లీజుల్లో తవ్వకాలపై ఎన్‌జీటీ తీవ్రస్థాయిలో కన్నెర్ర చేసింది. గతంలో ఇక్కడ లీజు మంజూరైనా తవ్వకాలు చేయలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగి తవ్వకాలు జరిగేలా చూశారు. లీజులో తవ్విన లేటరైట్‌ను తరలించేందుకు అటవీ ప్రాంతంలో చెట్లు కూడా తొలగించి రోడ్డు వేశారు. లీజు ప్రాంతంలో ఉల్లంఘనలకు పాల్పడుతోదంటూ దళిత ప్రగతి ఐక్యవేదిక అధ్యక్షుడు కోండ్రు మరిడయ్య ఎన్‌జీటీని ఆశ్రయించారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర నియంత్రణ మండలి అధికారులు పలు దఫాలు తనిఖీలు చేశారు. చివరకు లీజులో తవ్వకాలు ఆపారు.

సకుటుంబ సపరివార సమేతంగా అక్రమాలు - ఆయనకు అడ్డు చెప్పే వారే లేరు! - YCP MLA irregularities in Krishna

ABOUT THE AUTHOR

...view details