Bonalu festival 2024 :పట్నం తలపై బోనం కుండ మెరవనుంది. ఏటా ఆషాఢమాసం వచ్చింది అంటే చాలు భాగ్యనగరం పసుపు, కుంకుమల సౌభాగ్యనగరంగా మారిపోతుంది. డప్పుల మోతల మధ్య పచ్చి కుండల బోనమెత్తుకునే పెద్దముత్తైదువై కనువిందు చేస్తుంది. జాజులద్దుకున్న వాకిళ్లు, పసుపు రాసుకున్న ఆడపడుచులు, వేప కొమ్మలతో నిండిన గుమ్మాలతో నగరం పండుగ వాతావరణంను సతరించుకోనుంది.
జులై 7 నుంచి బోనాల సంబర మహోత్సవాలు :పోతురాజుల ఉగ్రరూపాలు, అమ్మోరు మెచ్చిన శివసత్తుల విన్యాసాల నడుమ భాగ్యనగరం జాతర సందడితో మురిపించనుంది. జులై 7 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బోనాల జాతరలు అంబరాన్నంటనున్నాయి. ఏటా ఆషాఢమాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారం నుంచి బోనాల జాతర మొదలవుతుంది. ఈ ఏడాది అమావాస్య శుక్రవారం రావటంతో ఆదివారం 7వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యి ఆగస్టు 4 వరకు కొనసాగనున్నాయి. గోల్కొండ కోటలో ప్రారంభమయ్యే బోనాల వేడుకలు తిరిగి 9వ పూజతో గోల్కొండ కోటలోనే ముగియనున్నాయి.
తొలిబోనం జగదాంబిక అమ్మవారికి :గోల్కొండ జగదాంబిక అమ్మ అక్కాచెల్లెళ్లైన మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ అనే మొత్తం ఏడుగురు అక్కచెళ్లెళ్లకు పండుగలో భాగంగా బోనాలు సమర్పిస్తారు. తొలిబోనం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాల సంబరాలకు అంకురార్పణ జరుగుతుందని చెప్పొచ్చు. రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు, మూడోబోనం లష్కర్‌గా పిలిచే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, నాలుగో బోనం లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవార్లకు సమర్పించటం ఆనవాయితీ.
ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ఠత :వీటితోపాటు తెలంగాణ పల్లెపల్లెల్లో కొలువైన గ్రామ దేవతలకు కూడా వారి వారి సంప్రదాయాల ప్రకారం బోనాలు సమర్పిస్తారు. నగరవ్యాప్తంగా జరిగే బోనాల వేడుకల్లో ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ఠత ఉంటుంది. ముఖ్యమైనవి గోల్కొండ, లష్కర్, లాల్ దర్వాజ బోనాలనే చెప్పాలి. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారు స్వయంభూ కావడంతో భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనం కోసం తరలి వస్తుంటారు.
ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు :తొలిరోజు ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి, అధికారులు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. లంగర్ హౌజ్ చౌరస్తా నుంచి ఊరేగింపుగా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు తీసుకుని చోటా బజార్‌లోని ఆలయ పూజారి ఇంటికి చేరుకుంటారు. అమ్మవారికి పట్టు బట్టలు సమర్పించి అక్కడ నుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకుని బంజారా దర్వాజ వైపుగా గోల్కొండ కోటకు చేరుకుంటారు.
బంజారా దర్వాజ నుంచి నజర్‌గా చెప్పే తొలిబోనంతో అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా గోల్కొండ కోటపైకి చేరుతుంది. అక్కడ అమ్మవారి ఘటాలు ఉంచి 9 వారాలు అమ్మవారికి అంగరంగ వైభవంగా బోనాల వేడుకలు నిర్వహిస్తారు. గోల్కొండలో ప్రారంభమయ్యే బోనాల వేడుకలు ఆగస్టు 4న చివరి పూజ, తొట్టెలు, ఫలహారం బళ్ల ఊరేగింపుతో గోల్కొండ కోటలోనే ముగుస్తాయి.
రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు :గోల్కొండ తర్వాత రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు ఎక్కిస్తారు. అయితే ఆషాఢ మాసంలోవచ్చే తొలి మంగళవారం ఎల్లమ్మకు కళ్యాణం నిర్వహించటం ఆనవాయితీ. ఇందులో భాగంగా తొలిరోజు ఎదుర్కోలు, రెండో రోజు కళ్యాణం, మూడోరోజు రథోత్సవ వేడుకలు నిర్వహిస్తారు. భక్తులు ఆదివారం బోనాలు చెల్లిస్తారు. కల్యాణ వేడుకలో ఏటా వేలాది మంది భక్తులు పాల్గొనటమే కాదు అమ్మవారి కళ్యాణం కోసం ప్రత్యేకంగా ఆలయం లోపలే పట్టు చీరలు నేయటం ఇక్కడి విశేషం.