Adulterated Food Across Telangana : రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు ప్రధాన పట్టణాల్లో ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో ఫుడ్ ట్రక్‌లు, తోపుడు బండ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు కనిపిస్తాయి. వాటిలో తినుబండారాలు రంగురంగులతో కనిపిస్తూ నోరూరిస్తాయి. అయితే ఆ ఆహార పదార్థాల్లో నాణ్యత ఎంత? వాటిని ప్రమాణాల ప్రకారమే తయారు చేశారా? ఆ ఆహార పదార్థాల్లో వాడిన రంగులు, మసాలాలు ఆరోగ్యకరమైనవేనా? అనేది మాత్రం ప్రశ్నార్థకమే. వీటిపై తనిఖీలు నిర్వహించాల్సిన ఆహార పరిరక్షణ విభాగం అధికారులే బాధ్యతను విస్మరించడంతో విక్రయదారులు చెలరేగిపోతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో మోమోస్, మయోనైజ్ తిన ఓ మహిళ మృతి చెందగా, మరో 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఆహార కల్తీ ఫలితమే అని విమర్శలు వెల్లువెత్తగా, ఈ వ్యవహారంపై ప్రజారోగ్య భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది బిజీబిజీగా ఉండటంతో ఎక్కువగా బయట ఆహారంపై ఆధారపడుతున్నారు. దీంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌ట్రక్‌లు, రెస్టారెంట్లు, చిరుతిళ్ల విక్రయ శాలలు పెరిగాయి. నగరంలోనే దాదాపు 70 వేలకు పైగా ఆహార విక్రయ కేంద్రాలు ఉన్నాయని అంచనా. అంతేకాకుండా తోపుడు బండ్లు, ఫుడ్ ట్రక్‌లు మరో 20 వేల వరకు ఉంటాయని సమాచారం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అధికారికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఆహార భద్రతాధికారులు (ఎఫ్‌ఎస్‌వో) 16,274 లైసెన్సులు మాత్రమే జారీ చేయడం గమనార్హం.
అనేక జిల్లాల్లో ఇన్‌ఛార్జ్ అధికారులే : సుమారు కోటిన్నర జనాభా దాదాపు 90 వేల ఆహార విక్రయ కేంద్రాలు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేవలం 21 మంది ఎఫ్‌ఎస్‌వోలు మాత్రమే ఉన్నారు. వీరు క్రమపద్ధతిలో హోటళ్ల తనిఖీ చేపడితే, అన్నింటినీ తనిఖీ చేయడానికి ఏళ్ల సమయం పడుతుంది. ఆహార పరిరక్షణ విభాగం కింద జిల్లాల పరిధిలో తనిఖీల కోసం 32 సర్కిళ్లు ఉండగా, గ్రేటర్ హైదరాబాద్‌లో 30 సర్కిళ్లు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిలో ఆహార కల్తీని జీహెచ్‌ఎంసీ ప్రజారోగ్య విభాగం పర్యవేక్షిస్తోంది.
రాష్ట్రంలోని మొత్తంగా 62 సర్కిళ్ల పరిధిలో లక్షల సంఖ్యలో ఉన్న ఆహార కేంద్రాల తనిఖీకి 76 మంది అధికారులే ఉండడం గమనార్హం. వాస్తవంగా ప్రతి ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతోపాటు ఒక గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఉండాలి. వీరందరినీ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పర్యవేక్షించాలి. కానీ అనేక జిల్లాల్లో ఇన్‌ఛార్జులే పర్యవేక్షిస్తున్నారు. ఉదాహరణకు వరంగల్ జిల్లా అధికారి జనగామకు ఇన్‌ఛార్జ్‌గా, హనుమకొండను చూసే అధికారి ములుగు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. వారి పరిధిలో సిబ్బంది, వాహనాల కొరత తీవ్రంగా ఉంది. ఫలితంగా ఒక్కో సర్కిల్ పరిధిలోని అధికారులు నెలలో కనీసం 30 నుంచి 35 నమూనాలు సేకరించాలనే నిబంధన అమలు కావడం లేదు.