Manduva Houses Special Story : వర్షం వస్తే ఇంట్లోకి పరుగులు తీస్తాం, కానీ ఆ ఇంట్లో వానజల్లు చూడటమూ ఆనందమే. ఎండొస్తే చిరాకుపడతాం, కానీ ఆ ఇంట్లో పొద్దుపొడిచినా, ఎండ కాసినా అద్భుతమే. చలికాలంలో వెచ్చదనం కోరుకుంటాం, కానీ ఆ ఇంట్లో చల్లటి గాలుల్నీ ఆస్వాదిస్తాం. అందమైన లోగిలి గల మండువా ఇంటి ప్రత్యేకతే అది మరి. అందుకే అన్ని కాలాల అనుభూతుల్నీ నట్టింట్లో చూపించే ఆ ఇంట్లో పుట్టిపెరిగిన వాళ్లెవరైనా సరే- ఆ మధురజ్ఞాపకాల్ని తలచుకోకుండా ఉండలేరు, ఇల్లే ఇలలో స్వర్గమనీ అంటూ రాగాలు తీయకమానరు!.
టేకు కలపతో సీలింగ్ (ETV Bharat) మండువా లోగిళ్లు అందమైన నివాసం మాత్రమే కాదు. ఉమ్మడి కుటుంబాల అనుబంధాల్ని హత్తుకునే ఓ లోగిలి. వీధిలో ఠీవిగా కనిపించే ఆ ఇంటి సింహ ద్వారమూ, లోపలికి ఆహ్వానించే అరుగూ, విశాలమైన వసారా, దాని చుట్టూ పదుల సంఖ్యలో గదులూ, పచ్చటి చెట్లతో కళకళలాడే పెరడు ఇలా చెబుతూపోతే ఆ ఇంటి విశేషాలు ఎన్నెన్నో. ఒకప్పటి అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభకు సజీవ సాక్ష్యాలు.
ఇంటి లోపల విశాల ప్రాంగణం.. మధ్యలో వాన నీటికి అమర్చిన పైపు (ETV Bharat) హుందాకు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు దర్పణాలు. వీటిని నిర్మించి వందేళ్లయినా చెక్కుచెదరలేదు. గాలి, వెలుతురుతోపాటు ఆప్యాయతలను కలబోసే ఈ ఇళ్లలో నిత్యం నిరుపమానమైన కళ తొణికిసలాడుతుంటుంది. వీటిలోనే పెళ్లిళ్లు, ఇతర క్రతువులన్నీ చేసేవారు. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండటం మండువా లోగిళ్ల ప్రత్యేకత. గదుల్లోకి గాలి వచ్చేలా, వాతావరణ మార్పులకు అనుగుణంగా వాస్తు ప్రకారం నిర్మించారు.
విశాలమైన వీధులు (ETV Bharat) ఎత్తయిన వీటి నిర్మాణానికి దృఢమైన ఇటుకలు, రాయి, కలప, ఇనుము, వెదురు, మట్టిపెంకులను వాడారు. ఇసుక, బెల్లం, కోడిగుడ్లు, సున్నం వేసి గానుగాడించిన మిశ్రమాన్నీ అవసరమైన చోట వినియోగించారు. ఈ లోగిళ్లలో అనేక సినిమాలు, సీరియళ్లను చిత్రీకరించారు. ఉభయగోదావరి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వీటి రాజసం కనిపిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు, పెనుగొండ మండలాల్లో ఉన్న మండువా లోగిళ్ల చిత్రాలివి. మరోవైపు మన సంప్రదాయంలో భాగమైన ఈ లోగిలి ఇళ్లను కేరళలో నాలుకెట్టు, కర్ణాటకలో గుత్తు మనె పేర్లతో పిలుస్తారు.
విదేశాల్లో ఉంటున్నారా?- హైదరాబాద్లో ఇల్లు అద్దెకు ఇవ్వాలనుకుంటున్నారా! - Real estate consultancies