Srikalahasti Palakova : శ్రీకాళహస్తి అంటే ఠక్కున గుర్తొచ్చేది కాళహస్తీశ్వరుని ఆలయం. అక్కడికి వెళ్లిన వారు మరిచిపోలేనిది మరొకటి ఉంది. అదే పాలకోవా! కాళహస్తి కోవా ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇంతకీ ఏమా రుచి? ఏంటి దాని ప్రత్యేకత. దీనికి ఐదు దశాబ్దాల చరిత్ర ఉంది. కల్తీలేని పాలకోవా ఇక్కడ తయారవుతుంది. పరిసర ప్రాంతాల పాడి రైతుల నుంచి సేకరించిన పాలతో దీనిని తయారు చేస్తారు.
ఇక్కడి కోవా తయారీలో ఎన్నో ప్రత్యేకతలు :పాలు వేడి చేయడానికి, పంచదారపాకం పట్టడానికి వేరుశనగ పొట్టు ఉపయోగిస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. వేరుశనగపొట్టు వాడడం వల్ల తగిన స్థాయి ఉష్ణోగ్రతలు పాలకోవాకు అదనపు రుచి తెస్తాయనే అభిప్రాయం ఉంది. అందుకే అధునాతన యంత్రసామగ్రి అందుబాటులోకి వచ్చినా దశాబ్ధాల నాటి సాధారణ పద్ధతిలోనే తయారు చేస్తున్నారు.
1974లో ఏర్పాటైన, శ్రీకాళహస్తి పాల సహకార సంఘం శ్రీకాళహస్తి పట్టణ పరిసర ప్రాంతాల రైతుల నుంచి పాలను సేకరిస్తోంది. కొన్నింటిని నేరుగా వినియోగదారులకు విక్రయిస్తున్నారు. మరికొన్ని పాలతో అనుబంధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. రోజూ వెయ్యి లీటర్ల పాలను కోవా, ఐస్ క్రీమ్, భాసుంది తయారీకి వినియోగిస్తున్నారు. ఇక్కడ తయారయ్యే పాలకోవాకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే ఈ వ్యాపారాన్ని విస్తరించడానికి శ్రీకాళహస్తి పాల సహకారసంఘం ప్రణాళికలు రచిస్తోంది.