Super Fine Paddy in Telangana : సన్నాలకు బోనస్ ఇవ్వనున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు యంత్రాంగం సిద్ధం అవుతోంది. ఒకే కేంద్రంలో సన్న, దొడ్డు బియ్యాలను కొనుగోలు చేస్తే సన్నాలను గుర్తించడం సమస్యగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే సన్నాల కొనుగోలుకు విడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వం వడ్లలో ఏఏ రకాలకు బోనస్ వర్తిస్తుందో చెప్పింది. గింజ పొడవు, వెడల్లు నిష్పత్తి నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉంటేనే బోనస్ రూ.500 వర్తిస్తుంది. వీటిని గుర్తించేందుకు ప్రత్యేక పరికరాలను అధికారులు కొనుగోలు కేంద్రాలకు పంపిస్తున్నారు.
దిగుబడి ఆధారంగానే కొనుగోలు కేంద్రాలు : రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం వడ్ల కొనుగోలుకు 7,139 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ కేంద్రాల్లో ఎన్నింటిని సన్న వడ్ల కొనుగోళ్లకు కేటాయించాలనే నిర్ణయాధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు ఇచ్చిందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. దిగుబడి ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. విస్తీర్ణం ప్రకారం చూస్తే సన్నాల సాగులో నిజామాబాద్ అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాత నల్గొండ, జగిత్యాల, కామారెడ్డి, ఖమ్మం జిల్లాలు తదుపరి స్థానాల్లో ఉన్నాయి.
అందుకే నిజామాబాద్‌కు 480 కేంద్రాలను ప్రతిపాదించారు. ఇక్కడ ఎనిమిది లక్షల ధాన్యం దిగుబడి వస్తే, ఏడు లక్షలు సన్నాలే ఉంటాయని అధికారుల అంచనా. ఆసిఫాబాద్ జిల్లాలో 45,329 ఎకరాల్లో వరి సాగు అయితే, అందులో మొత్తం సన్నాలే. దీంతో ఇక్కడ 30 కేంద్రాల్లో సన్నాలే కొనుగోలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
సాగు విస్తీర్ణం, దిగుబడి :
- వరి సాగు - 60.80 లక్షల ఎకరాల్లో
- దిగుబడి - 146.70 లక్షల టన్నులు(అంచనా)
- కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం - 91.00 లక్షల టన్నులు(అంచనా)
- దొడ్డు రకం - 44.00 లక్షల టన్నులు
- సన్న రకం - 47.00 లక్షల టన్నులు