Sankranti 2025: రాష్ట్రంలో అతి పెద్ద పండుగ సంక్రాంతి. విద్యాసంస్థలకు ప్రభుత్వం శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించింది. దీంతో ప్రజలంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. దేశ, విదేశాల్లో స్థిరపడిన వారంతా సంక్రాంతికి స్వస్థలానికి రావడం ఆనవాయితీ. ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా తిరిగి ఒక్క చోట కలుసుకుంటుంటారు. అందుకు తగ్గట్లుగానే బంధుమిత్రులంతా దాదాపు పది రోజుల పాటు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. దీంతో పల్లెల్లో కోలాహలం ఉంటుంది. ఊరూ, వాడా పండుగ సందడి మార్మోగుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపిస్తోంది.
హైదరాబాద్, బెంగళూరు సహా పలు ప్రాంతాల నుంచి ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. దీంతో అన్ని బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఇప్పటికే పండగ రద్దీ దృష్ట్యా 7,200 అదనపు బస్సులు నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి మొదలైన బస్సులు ఈ నెల 13వ తేదీ వరకు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి పలుచోట్లకు 2,153 బస్సులను ఆర్టీసీ నడపనుంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు 114 అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ మేరకు అదనపు బస్సులను అధికారులు సిద్ధం చేశారు.
బెంగళూరు నుంచి పలుచోట్లకు 375 బస్సులను తిప్పనున్నారు. విజయవాడ నుంచి 300 అదనపు బస్సులు నడపనున్నారు. తిరుగు ప్రయాణాలకు ఈ నెల 16 నుంచి 20 వరకు 3,200 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవని ఆర్టీసీ ఎండీ తెలిపారు. సాధారణ బస్సు ఛార్జీలే ప్రత్యేక బస్సుల్లో ఉంటాయన్నారు.