HC DISMISSES CHEVIREDDY PETITION: వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోక్సో కేసులో చెవిరెడ్డి వేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బాలికపై అత్యాచారం జరిగిందంటు అసత్య ప్రచారం చేశారని ఆరోపణలపై చెవిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ చట్టం, పోక్సో కింద కేసు నమోదు చేశారు.
కాగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై గతంలో పోలీసులు పోక్సో కేసు నమోదుచేశారు. తిరుపతి జిల్లాకి చెందిన ఓ బాలికపై అత్యాచారం జరిగిందంటూ వ్యాఖ్యానించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో చెవిరెడ్డిపై కేసు నమోదైంది. వాస్తవాలు నిర్ధారించుకోకుండా తప్పుడు ప్రచారం చేయడంపై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీంతో బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు నమోదు చేశారు.
ఇదీ ఘటన: బాలిక పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా కొంతమంది దుండగులు తనపై దాడిచేసి మత్తు మందు తాగించారని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే బాలిక చెప్పిన దాంట్లో ఎటువంటి నిజం లేదని పోలీసులు తరువాత తేల్చారు. బాలికకు సహచర విద్యార్థితో స్నేహం ఉంది. ముందుగా అనుకున్న ప్రకారం వారిద్దరూ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే మార్గంలో కలుసుకున్నారు. ఆలస్యం కావడంతో తల్లిదండ్రులు వెతుక్కుంటూ రావడాన్ని గమనించిన బాలిక వెంటనే గాజులతో తన శరీరంపై గాయాలు చేసుకుని, వారికి అబద్ధం చెప్పింది. బాలుడితో తన స్నేహం బయటపడుతుందనే కారణంతోనే ఇలా కట్టుకథ అల్లింది.
దీనిపై వాస్తవాలు నిర్ధారించుకోకుండానే బాలిక చదివే పాఠశాలకు వెళ్లిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆమెపై అత్యాచారం జరిగిందని, బాలికకు అండగా ఉంటామంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే అనంతరం బాలికకు వైద్యపరీక్షలు చేయగా అందులో అత్యాచారం జరగలేదని తేలింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపినా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినట్లు తేల్చారు. ఈ కేసులో బాధితురాలు బాలిక కావడంతో పాటు ఆమె కుటుంబసభ్యుల వివరాలను ప్రచారం చేయడంతో పోక్సో చట్టం ఉల్లంఘించినట్లైంది. దీనిపై అసత్యప్రచారం చేసి తమను మనోవేదనకు గురిచేశారంటూ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెవిరెడ్డిపై పోక్సో కేసు నమోదు చేశారు. దానిని క్వాష్ చేయాలంటూ చెవిరెడ్డి వేసిన పిటిషన్‌ను తాజాగా హైకోర్టు కొట్టివేసింది.