Special Branch Police Stood by a Family in Gudivada:ఒక స్పెషల్ బ్రాంచ్ పోలీసు స్పందించకపోయి ఉంటే ఈ పాటికి ఓ అమాయకుడు గంజాయి కేసులో కటకటాల పాలయ్యేవాడు. తరచూ యువకుల వేధింపులకు గురవుతున్న ఆయన కుమార్తె జీవితం సర్వనాశనమయ్యేది. అభం శుభం తెలియని కుటుంబం వీధిన పడేది. ఎస్బీ పోలీసు మానవీయ ధోరణి, జిల్లా ఎస్పీ సముచిత మార్గనిర్దేశం బాధిత కుటుంబానికి రక్షా కవచంగా నిలిచాయి. ఈ సంఘటనలో ఇది ఒక పార్శ్వమైతే, బాధితుల మొర వినకుండా తొలి నుంచి నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఇద్దరు పోలీసు అధికారులను మాత్రం ఉన్నత అధికారులు వదిలేశారు. వారిపై కనీస చర్యలు లేకపోవడంతో వైసీపీ కండువాలే వారికి రక్షణగా నిలిచాయా అనే చర్చ కృష్ణా జిల్లా గుడివాడలో జోరుగా సాగుతోంది. గుడివాడలో జరిగిన ఈ ఉదంతంలో రెండు పోలీసు స్టేషన్లకు చెందిన ఇద్దరు సీఐలు నిరంకుశంగా వ్యవహరించారు. వారిపై చర్యలకు జిల్లా ఉన్నత అధికారులు సిఫార్సు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి వారితో ఎన్నికల నిష్పాక్షిక నిర్వహణ ఎలా సాధ్యమనే ప్రశ్నలు వస్తున్నాయి.
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్ లైంగిక వేధింపులు.. దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
గుడివాడ ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఇంటి పెద్ద చిన్న ఫ్యాన్సీ స్టోర్ నడుపుతున్నారు. కుమార్తె ఇంటర్మీడియట్ చదువుతున్నారు. వారి నివాసం ఎదురుగా ఓ శిథిల భవనం ఉంది. ఆకతాయిలు అక్కడకు వచ్చి మత్తు పదార్థాలను సేవిస్తుంటారు. బాలిక కళాశాలకు వెళ్లి వస్తుండగా వేధిస్తుండేవారు. తలవంచుకుని వచ్చే ఆమె ఒక రోజు భరించలేక తండ్రికి చెప్పడంతో ఇద్దరూ వెళ్లి పోలీసు స్టేషన్‌లో మార్చి 18న తొలిసారి ఫిర్యాదు చేశారు. ఆకతాయిలకు అండగా మరో గంజాయి దళారీ వచ్చి సీఐ ఇంద్ర శ్రీనివాస్‌తో కలిసి చక్రం తిప్పారు. ఈ సారి క్షమించి వదిలేయాలని బాధితులకు పోలీసులు సూచించారు. అయినా వేధింపుల పర్వం ఆగలేదు. మార్చి 20, 22, 24, 26, 29వ తేదీలలోనూ బాధితులు ఫిర్యాదులు చేశారు.
గంజాయి సేవిస్తున్నారని, పగలు రాత్రి అనే తేడా లేకుండా శిథిల భవనంలోనే ఉంటున్నారని బాలిక తండ్రి సీఐ దృష్టికి తీసుకువచ్చారు. ఆయన దుర్మార్గులను గట్టిగా మందలించి కేసు నమోదు చేయకుండానే వారిని వదిలేశారు. దీన్ని అలుసుగా తీసుకున్న ఓ దుర్మార్గుడు అమ్మాయి సైకిల్‌పై వస్తుండగా వేధించాడు. చేయి పట్టుకుని ఆపి పెళ్లాడాలని గంజాయి మత్తులో ఒత్తిడి తెచ్చాడు. తాము ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితులను పోలీసుల ఎదుట బాధితులు మొర పెట్టుకున్నప్పటికీ కేసు పెట్టలేదు. తండ్రీ కుమార్తెలు మార్చి 31న మరోసారి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 1న దిశకు తండ్రి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చింది.
వేధింపుల ఆరోపణలపై ఇద్దరు సీఐలపై వేటు - వీఆర్‌కు పంపించిన ఎస్పీ అన్బురాజన్