Healthy Protein Dosa Recipe : ప్రస్తుత కాలంలో జీవనశైలి మార్పులు, వ్యాయామం చేయకపోవడం, జంక్‌ఫుడ్ వంటివి తినడం వల్ల చాలా మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. మన శరీర బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆయాసం, శ్వాస ఇబ్బందులు, నీరసంగా అనిపించడం వంటి రకరకాల ఇబ్బందులు ఎదురవుతాయి. దీర్ఘకాలంలో అధిక బరువు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులకూ కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఎక్కువ మంది వెయిట్‌లాస్ కోసం ప్రయత్నించేవారు బ్రేక్‌ఫాస్ట్‌ని స్కిప్ చేస్తుంటారు. అలా కాకుండా ఉదయాన్నే అల్పహారంలో మంచి ప్రొటీన్ ఉండే ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, మీకోసం ప్రొటీన్ ఎక్కువగా ఉండే 'దోశ రెసిపీ' తీసుకొచ్చాం. ఈ దోశలు రెండు తింటే మధ్యాహ్నం వరకు ఆకలి కాకుండా ఉంటుంది. ఈ దోశలు కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీతో ఎంతో రుచికరంగా ఉంటాయి. పిల్లలు పెద్దలూ ఇలా ఇంట్లో ఎవరైనా ఈ ప్రొటీన్ దోశలను ఇష్టంగా తింటారు. మరి ఇక ఆలస్యం చేయకుండా ప్రొటీన్ దోశలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- కొర్రలు - కప్పు
- పెసలు - అరకప్పు
- శనగ పప్పు - అరకప్పు
- బబ్బర్లు - అరకప్పు
- మినప్పప్పు - అరకప్పు
- కరివేపాకు - 2
- మిరియాలు - టీస్పూన్
- అల్లం ముక్కలు - 2 చిన్నవి
- జీలకర్ర - 2 టీస్పూన్లు
- ఇంగువ - చిటికెడు
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
- ముందుగా కొర్రలు, పెసలు, శనగ పప్పు, బబ్బర్లు, మినప్పప్పు శుభ్రంగా కడిగి విడివిడిగా చిన్న గిన్నెలలో మూడు గంటలు నానబెట్టుకోవాలి.
- ఆపై వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని బాగా కలపాలి.
- తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వీటిని వేసుకోవాలి. ఇందులో అల్లం ముక్కలు, కరివేపాకు, మిరియాలు వేసి మధ్యమధ్యలో నీళ్లు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- తర్వాత పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపండి.
- పిండి మరీ జారుగా, గట్టిగా కాకుండా అట్ల పిండిలా ఉండేలా నీళ్లు కలపాలి.
- ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి స్ప్రెడ్ చేయండి.
- ఆపై గరిటెతో దోశ పిండిని వేసుకుని దోశ వేసుకోండి.
- తర్వాత దోశ అంచుల వెంబడి కాస్త నూనె వేయండి. ఒక రెండు నిమిషాల తర్వాత దోశను మరోవైపు తిప్పుకుని కాల్చుకోండి.
- దోశ చక్కగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే ఇలా మిగిలిన పిండితో దోశలు చేసుకుంటే సరి!
- ఎంతో రుచికరమైన హెల్దీ ప్రొటీన్ దోశలు మీ ముందుంటాయి.
- ఈ దోశ రెసిపీ నచ్చితే మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
గుంటూరు ఘాటుతో గోంగూర మటన్ - చూస్తేనే నోరూరిపోయేలా!
నానబెట్టడాలు, మిక్సీ పట్టడాల్లేవ్! - 10 నిమిషాల్లో కరకరలాడే రవ్వ పునుగులు