SP Bindumadhav Press Meet on Situation in Palnadu District:పల్నాడు జిల్లాలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. ముగ్గురుకు మించి జనం గుమిగూడినా సమావేశాలు, సభలు నిర్వహించినా అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా 1800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మాచర్ల, గురజాల, నరసరావుపేట నియోజకవర్గాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కారంపూడిలో పిన్నెల్లి, గురజాల నియోజకవర్గం కొత్తగణేషునిపాడులో కాసుమహేశ్‌రెడ్డి హల్‌చల్ చేయడంతో ఆయా ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.
SP Bindumadhav:పల్నాడు జిల్లాలో పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. జిల్లాలో రెండు రోజులుగా అవాంఛనీయ ఘటనలు జరిగాయని అన్నారు. గొడవలపై కేసులు నమోదు చేశామని అందుకు గల కారకులను గుర్తించామని తెలిపారు. మాచర్ల, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లిలో కేంద్ర బలగాలు మోహరించాయని చెప్పారు. పల్నాడు జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు ఎక్కడికక్కడ వాహన తనిఖీలు జరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. జిల్లాలో మరికొన్ని రోజులు 144 సెక్షన్ అమలులో ఉంటుందని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే ఎవరినీ వదిలిపెట్టమని ఎస్పీ బిందుమాధవ్ హెచ్చరించారు.
కేవలం మాచర్ల, కారంపూడి పట్టణాల్లో 12వందల మంది పోలీసుల్ని నియమించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిని గృహనిర్భందం చేశారు. పట్టణంలో అడుగడుగునా పోలీస్ బందోబస్తు నియమించారు. మాచర్లకు వచ్చే వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ మాచర్లలోనే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.