General Coaches Increase in Indian Railways : ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశల వారీగా పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రస్తుతం రెండే జనరల్ కోచ్‌లు ఉన్న రైళ్లలో ఆ సంఖ్యను నాలుగుకు చేరుస్తున్నట్లు పేర్కొంది. అవి కూడా ఆధునిక పరిజ్ఞానం కలిగిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. జోన్ పరిధిలోని 21 జతల రైళ్లకు అదనంగా 80 ఎల్‌హెచ్‌బీ బోగీలు ఆధునిక సాంకేతికతతో అందుబాటులోకి వస్తాయని బుధవారం (డిసెంబర్ 04) ప్రకటించింది.
కొత్త రూపం - అధిక సీట్లు :రైళ్లలో ఎక్కువ మంది పేదలు ప్రయాణించే జనరల్ బోగీల రూపం మారబోతుంది. ఇన్నాళ్లు రైళ్లలో ఒకప్పటి పాత రోజుల నాటి సాధారణ బోగీలే ఉన్నాయి. అనేక రైళ్లలో రెండే జనరల్ బోగీలు ఉండటంతో పేద ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలనే ఆలోచనతో రైల్వే బోర్డు ఆ మేరకు కసరత్తు ప్రారంభించింది. కొత్తగా వచ్చే జనరల్ బోగీలను ఎల్‌హెచ్‌బీ పరిజ్ఞానంతో తయారు చేసి ప్రవేశపెడుతున్నారు.
పాతతరం ఐసీఎఫ్ బోగీల్లో 90 సీట్లు ఉంటే ఎల్‌హెచ్‌బీ బోగీల్లో 100 సీట్లు ఉంటాయి. ఇందులో ఎక్కువ మంది సురక్షితంగా ప్రయాణించవచ్చు. ప్రమాదం జరిగినప్పుడు తక్కువ నష్టం ఉంటుంది. ఏసీ, స్లీపర్ క్లాసుల్లో మాత్రమే ఎల్‌హెచ్‌బీ బోగీలను రైల్వే శాఖ ప్రవేశపెడుతూ వచ్చింది. తాజాగా జనరల్ క్లాస్‌లోనూ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జోన్ పరిధిలో 19 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు 66 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ఏర్పాటు చేశారు.