Special Trains from Secunderabad to Tirupati:కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. డైలీ ఎంతో మంది భక్తులు కాలి నడక మార్గం ద్వారా ఏడుకొండలుఎక్కి తమ మొక్కులను చెల్లించుకుంటారు. అయితే, సాధారణ రోజుల్లోనే భక్తుల రద్దీ ఉంటే.. వేసవి సెలవుల్లో భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే తిరుపతి వెళ్లే వారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఎండాకాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతికి ఒక ప్రత్యేక రైలు సర్వీస్‌ను నడపనున్నట్లు ప్రకటించింది. మరి ఆ స్పెషల్ రైలు ఏ తేదీన తిరుపతికి బయలుదేరనుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రత్యేక రైలు ఇదే!సికింద్రాబాద్ నుంచి ఈ నెల 11వ తేదీన తిరుపతికి వెళ్లేప్రత్యేక రైలు అందుబాటులో ఉండనుంది. ఈ రైలు నెంబర్ 07489. ఈ రైలు మే 11 రాత్రి 10.05 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు మధ్యలో కాచిగూడ, ఉందానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, రాయిచూర్ జంక్షన్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట జంక్షన్ స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
అలాగే తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును అందుబాటులో ఉంచారు. ఈ రైలు నెంబర్ 07490. ఈ నెల 13వ తేదీన రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు మధ్యలో రేణిగుంట జంక్షన్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ, మౌలాలి స్టేషన్లలో ఆగుతుంది. సమ్మర్‌లో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కో సర్వీస్ చొప్పున ఈ స్పెషల్ రైలును నడపనున్నారు.