ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ జిల్లాల కలెక్టర్లకు ఏమైంది - నిధులున్నా నిర్లక్ష్యమేలా? - MGNREGS FUNDS ISSUE IN AP

రాష్ట్రంలో అభివృద్ధికి నిధులిచ్చినా ఖర్చు చేయని అధికారులు

MGNREGS Funds Issue in AP
MGNREGS Funds Issue in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 21, 2024, 8:58 AM IST

MGNREGS Funds Issue in AP :కూటమి ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మంజూరు చేసిన అధికారులు ఖర్చు చేయడం లేదు. ఆరు నెలల క్రితం వరకు నిధులు లేవంటూ కబుర్లు చెప్పి ఇప్పుడు పుష్కలంగా నిధులున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటి ఖర్చుపై కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల స్థాయిలో సమీక్షలూ అంతంత మాత్రంగానే జరిగాయి. 11 జిల్లాల్లో కేవలం రూ.567.14 కోట్లే వెచ్చించారు. ఆ జిల్లాల కలెక్టర్లకు ఏమైందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే సూచనలు వినిపిస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అభివృద్ధి పనులకు అత్యధిక నిధుల ఖర్చుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అనుమతులిచ్చింది. ఆ శాఖకు సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ఉన్నా నిధుల ఖర్చు నత్తనడకగా సాగుతోంది. వీటిని ఖర్చు చేసి గ్రామాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టించాలన్న ఆయన ఆదేశాలు 11 జిల్లాల్లో సరిగా అమలు కావడం లేదు. సర్కార్ విడుదల చేసిన రూ.1,995.78 కోట్లలో రూ.567.14 కోట్లే ఖర్చు చేశారు. వీటిలో మూడు జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

మెటీరియల్‌ నిధుల వ్యయం 11 జిల్లాల్లో ఇప్పటికీ 40 శాతానికి చేరుకోలేదు. నిధులిచ్చినా ఖర్చు చేయడంలో నిర్లిప్తంగా వ్యవహరించడంపై ఇటీవల కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించి సమీక్షించిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో రహదారుల పనులకు ఇచ్చిన రూ.661.47 కోట్లలో రూ.144.32 కోట్లు ఖర్చు చేశారు. అంటే వ్యయం 25 శాతమూ లేదు. శ్రీకాకుళం, అనకాపల్లి, బాపట్ల, కాకినాడ, ఏలూరు, పల్నాడు, విశాఖ జిల్లాలకు చేసిన కేటాయింపుల్లో ఖర్చు 40 శాతం లోపే ఉంది.

ఉపాధి హామీ పథకం మెటీరియల్‌ నిధుల వినియోగంలో వెనుకబడిన జిల్లాలు :

జిల్లా కేటాయించిన నిధులు ( కోట్లలో) ఖర్చు చేసినవి(కోట్లలో) శాతం
తిరుపతి రూ.194 కోట్లు రూ.37.50 కోట్లు 19.33 శాతం
ఎన్టీఆర్ రూ.136.15 కోట్లు రూ.31.59 కోట్లు 23.20 శాతం
విజయనగరం రూ.331.32 కోట్లు రూ.75.23 కోట్లు 22.71 శాతం
బాపట్ల రూ.123.94 కోట్లు రూ.37.32 కోట్లు 30.11 శాతం
కాకినాడ రూ.115 కోట్లు రూ.36.06 కోట్లు 31.36 శాతం
శ్రీకాకుళం రూ.327.46 కోట్లు రూ.98.34 కోట్లు 30.03 శాతం
అనకాపల్లి రూ.214.87 కోట్లు రూ.64.14 కోట్లు 29.85 శాతం
ఏలూరు రూ.194.51 కోట్లు రూ.62.55 కోట్లు 32.16 శాతం
పల్నాడు రూ.117.33 కోట్లు రూ.41.03 కోట్లు 34.97 శాతం
నెల్లూరు రూ.212 కోట్లు రూ.81.54 కోట్లు 38.46 శాతం
విశాఖపట్నం రూ.29.20 కోట్లు రూ.11.14 కోట్లు 38.15 శాతం


కలెక్టర్లు ప్రత్యేకంగా చొరవ తీసుకుని డ్వామా పథక సంచాలకులు, పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్లతో కలిసి నిరంతరం సమీక్షలు జరిపి పనుల్లో వేగం పెంచి గడువులోగా నిధులు ఖర్చు చేయించవచ్చు. ఉపాధి నిధుల వ్యయం ప్రాధాన్యం కాదన్నట్లుగా కొందరు కలెక్టర్లు వ్యవహరిస్తున్నారు. ఉపాధి హామీ పథకానికి జిల్లా స్థాయిలో కలెక్టరే ఛైర్మన్‌ అనే విషయాన్ని పలువురు గుర్తించడం లేదు. ఈ కారణంగా డ్వామా పీడీలు, ఇంజినీర్లు, ఎంపీడీవోలు, ఉపాధి సిబ్బంది ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

వారానికోసారి చెల్లింపులు అయినా పట్టదా? : వైఎస్సార్సీపీ సర్కార్​లో ఉపాధి పథకం కింద మెటీరియల్‌ పనులు చేసిన వారు బిల్లుల కోసం ఏడాదికిపైగా ఎదురు చూసేవారు. కొందరు ఆ పార్టీ పెద్దలతో పైరవీలు చేయించుకుని బిల్లులు పొందేవారు. ఇప్పుడు పైరవీలకు ఆస్కారం లేకుండా ఏపీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. ప్రతి గురువారం బిల్లులు చెల్లించాలని నిర్ణయించి పక్కాగా అమలు చేస్తోంది. పూర్తి చేసిన పనుల వివరాలను ఇంజినీర్లు ఎం.బుక్‌లో రికార్డు చేశాక ఎంపీడీవోలు ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్లు అప్‌లోడ్‌ చేయగానే బిల్లులు చెల్లిస్తున్నారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించాక ఇప్పటివరకు ఈ విధంగా చెల్లించిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని పనులు చేసేవారికి తెలియజేయడంలోనూ కొన్ని జిల్లాల్లో అధికారులు విఫలమవుతున్నారు. సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు.

పనుల నిర్వహణలో జిల్లా స్థాయిలో డ్వామా పీడీలు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, క్షేత్రస్థాయిలో పంచాయతీరాజ్‌ ఇంజినీర్లది క్రియాశీలక పాత్ర. వీరి ద్వారా పనులు చేయించాల్సిన బాధ్యత కలెక్టర్లది. కొన్ని జిల్లాల్లో కొందరు అధికారులు ఇంకా పాత ధోరణిలోనే పని చేస్తున్నారు. కృష్ణా, విజయనగరం, చిత్తూరు, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, అనంతపురం, అనకాపల్లి, బాపట్ల జిల్లాల్లో గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నేతలతో అంటకాగిన పలువురు అధికారులే ఇప్పటికీ కీలక స్థానాల్లో ఉన్నారు.

అమరావతి నిర్మాణంలో మరో కీలక అడుగు - 8వేల కోట్ల నిధులకు ఏడీబీ ఆమోదం

ఏపీలో పర్యాటకం పరుగులు - తొలివిడతగా రూ.113 కోట్లు మంజూరు చేసిన కేంద్రం

ABOUT THE AUTHOR

...view details